విజయవాడ, డిసెంబర్ 21, (way2newstv.com)
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వానికి ధీటుగా జవాబివ్వాలని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ముఖ్యంగా ఇసుక, ఉల్లి విషయాలపై సభను దడ దడలాడించాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సమావేశాలకు ముందు తమ్ముళ్లతో భేటీ అయి ఇదే సంకల్పం చెప్పుకొన్నారు. అయితే, ఈ తరహా వ్యూహం మాత్రం చంద్రబాబు ఎక్కడా చూపించలేకపోయారు. తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల్లో తొలి రోజు నుంచి కూడా ప్రభుత్వమే పైచేయి సాధించింది. అంతేకాదు, పలు కీలక బిల్లులను కూడా ఆమోదించి.. గత చంద్రబాబు పాలనకు సవాల్ విసిరింది.ఇదే సమయంలో చంద్రబాబు టీంపై ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
పనిచేయని చంద్రబాబు వ్యూహాలు
చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగా వారు సభలో తమ గళం వినిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఇలాంటి వ్యూహం కానీ, గళం కానీ ఏ ఒక్కరూ వినిపించక పోవడం గమనార్హం. పైగా కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పిన విషయం సభలో నవ్వుల పాలైంది. ఎస్సీ, ఎ స్టీ సబ్ ప్లాన్ నిధులను వైఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ఆయన అతిశయానికి పోయారు.ఇది సభలో తీవ్ర వివాదానికి, ఎమ్మెల్యే పరిశీలనకు కూడా ఇబ్బందిగా మారిపోయింది. వాస్తవానికి సబ్ ప్లాన్ అనే ప్రస్తావన వచ్చిందే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో. దీంతో టీడీపీ పరిస్థితి నవ్వుల పాలైంది. ఇక, మద్యం దుకాణాల విషయంలోనూ టీడీపీ వైఖరి తప్పు బాటే పట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 4 వేల పైచిలుకు వైన్ దుకాణాలు ఉన్నాయనేది ఎక్సైజ్ అధికారుల వాదన. అయితే, టీడీపీ మాత్రం ఎన్ని దుకాణాలు ఉన్నాయో చెప్పకుండా వాదన ప్రారంభించింది. దీనిపై మాట్లాడిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నంలో తానే తప్పులో కాలేసి పార్టీ పరువును తీసేశారు. దీనిపై సీఎం జగనే సీరియస్ అయ్యారు.ఇక, ఆఖరి రోజు రాజధానిపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అమరావతి ప్రాంతంలో టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన భూముల వివరాలను ఏకరువు పెట్టారు. దీంతో టీడీపీ మొత్తంగా డీలా పడిపోయింది. పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వాళ్లెవరు అసెంబ్లీలో పోరాడడం లేదు. గంటా లాంటి వాళ్లు అసెంబ్లీ సమావేశాలకే రావడం లేదు. మరికొందరు వచ్చినా చేసేదేం ఉండడం లేదు. ఏదేమైనా ఈ పసలేని నాయకులను అసెంబ్లీలో పెట్టుకుని చాలాసార్లు చంద్రబాబు సైతం సమాధానం ఇవ్వలేని పరిస్థితి. తొలి ఆరు నెలల్లోనే ఇలా ఉంటే మరో నాలుగున్నరేళ్లు ఎలా ఈదుతారో ? చూడాలి.