కాకినాడ, డిసెంబర్ 12, (way2newstv.com)
అన్నవరం... రత్నగిరిపై కొలువైయున్న సత్యదేవుడు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరు ఏటా రూ.100 కోట్ల ఆదాయం కలిగివున్న అన్నవరం దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా సత్యదేవుని దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాలైన శ్రావణమాసం, కార్తీక మాసాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తుతుంటారు. కార్తీక మాసంలో ప్రతీరోజు 50 వేలకు పైబడి భక్తులు స్వామి వారి వ్రతాలు, దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం, సోమవారం దశమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో 10 వేలకు పైగా వ్రతాలు జరుగుతుంటాయి.
రత్నగిరి అంతరాలయం దర్శనానికి ఇక్కట్లు
పర్వదినాల్లో 70 వేల నుండి లక్ష మంది వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి వారి మూల విరాట్ దర్శనం అనంతరం దిగువ ధ్వజస్తంభం చుట్టూ తిరిగి స్వామి వారి పాదాల దర్శనం చేసుకోవడంతోనే స్వామి వారి సంపూర్ణ దర్శనం పూర్తయినట్టు భక్తులు భావిస్తుంటారు. కాని ఆలయ విభాగానికి చెందిన ముఖ్య అధికారి ఇష్టానుసారం తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ క్షణాల్లో అమలుపరచడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతి భక్తునికి రూ.100 టిక్కెట్ తీసుకుంటే గర్భగుడిలో స్వామి వారి దర్శనంతోపాటు పేరు, గోత్ర నామాలు చదివి అర్చకులు శఠగోపంతో ఆశీర్వదిస్తారు. అనంతరం దిగువనున్న యంత్రాలయంలో స్వామి వారి పాదాల దర్శనానికి ఒక వ్యక్తికి రూ.50 టిక్కెట్ చొప్పున నిర్ణయించారు. భక్తులను యంత్రాలయంలో పాదాల చుట్టూ తిరగడానికి అనుమతించేవారు. కాని ఆలయానికి చెందిన ఒక అధికారి రద్దీ పేరిట భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ గర్భగుడి దర్శనం కోసం టిక్కెట్ తీసుకున్న వారికి గర్భగుడి దర్శనం లేకుండా చేయడం, యంత్రాలయ ఆలయ తలుపులను ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా మూసివేసి ఉంచుతుండటంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.