గుంటూరు, డిసెంబర్ 30, (way2newstv.com)
చింతమనేని ప్రభాకర్. రాష్ట్ర రాజకీయాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ వివాదాస్పద నాయకుడిగాఆయన పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే కొన్నాళ్లు జైలు జీవితం గడిపి కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద నాయకుడే గుంటూరులోనూ టీడీపీకి ఎదురయ్యారు. ఆయనే మరో చింతమనేనిగా గుంటూరులో చలామణి లో ఉన్న యరపతినేని శ్రీనివాసరావు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా, పార్టీ అధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన ఆయన పార్టీ అధికారంలో ఉండగా ఓ రేంజ్‌లో అధికారం చెలాయించారు.పల్నాడులోని గురజాల నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు.. మొత్తంగా మూడుసార్లు విజయం సాధించిన యరపతినేని శ్రీనివాాస్ క్షేత్రస్థాయిలో పట్టుసాధించారు.
గుంటూరులో యరపతినేని ఒంటరి
పేదలు, మహిళల్లో కొంత పేరుంది. అయితే, అదే సమయంలో ఆయన మైనింగ్ మాఫియా డాన్‌గా రికార్డుల్లోకి ఎక్కడం ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే హైకోర్టు ఆయనను కేంద్రంగా చేసుకుని పోలీసులపై చీవాట్లు పెట్టడం తెలిసిందే. మైనింగ్ అక్రమాల్లో ఆరితేరారంటూ.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే యరపతినేని శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ క్రమంలోనే కేసులు కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ ఏడాది ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన యరపతినేని శ్రీనివాస్ తీవ్ర ఇక్కట్లో మునిగిపోయారు.యరపతినేని శ్రీనివాస్ చంద్రబాబు హయాంలోనే నమోదైన మైనింగ్ కేసుల్లో దాదాపు వేల కోట్లలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే యరపతినేని శ్రీనివాస్ ప్రజల సొమ్మును జేబులో వేసుకున్నారని కేసులు నమోదయ్యాయి. వీటిపై అప్పట్లోనే విచారణ జరిగినా.. తాజాగా వైసీపీ ప్రభుత్వం ఈ కేసులను సీబీఐకి అప్పగించింది. దీంతో యరపతినేని శ్రీనివాస్ పై మైనింగ్ ఉచ్చు మరింతగా బిగుసుకుంది. వచ్చే నెల ప్రారంభంలోనే ఈ కేసునువిచారించేందుకు సీబీఐ అధికారులు ఏపీకి రానున్నారు. అయితే, ఇప్పుడు పార్టీ ఆయనకు ఏమేరకు సహకరిస్తుంది? అనేది కీలక ప్రశ్నగా మారిపోయింది.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని శ్రీనివాస్ కి అటు బాబు, ఇటు లోకేష్ ఇద్దరు అమితమైన ప్రయార్టీ ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ఓడిపోవడం యరపతినేని శ్రీనివాస్ పై మైనింగ్ ఉచ్చు బిగుసుకుంటుండడంతో దూరం దూరం జరుగుతున్నట్టు పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. యరపతినేని శ్రీనివాస్ మైనింగ్ కేసులపై సీబీఐ నేరుగా విచారణకు రెడీ అవుతోన్న నేపథ్యంలో అంతా జరిగిపోయి..యరపతినేని శ్రీనివాస్ జైలుకు వెళ్లిపోయాక.. చంద్రబాబు స్పందిస్తారా? లేక తప్పు చేశారు కాబట్టి శిక్షించాలని అంటారా? ఏం చేస్తారు? ఏ విధంగా తన పార్టీ సీనియర్ నేతను కాపాడుకుంటారు? అన్నది చూడాలి.