విత్తనానికి ఢోకా లేదు (ప్రకాశం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విత్తనానికి ఢోకా లేదు (ప్రకాశం)

ఒంగోలు, డిసెంబర్ 09 (way2newstv.com):
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకుంది. మండల కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తన నిల్వ కేంద్రం, గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. దీనికితోడు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. గ్రామ సచివాలయంలోని ఆర్‌బీకే కేంద్రంలో ఆర్డర్లపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు చెంతకే చేరనున్నాయి. ప్రకాశం జిల్లా మరో నమూనా ప్రాజెక్టుకు ఎంపికైంది. ప్రతి మండల కేంద్రంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల నిల్వల కేంద్రం, మండలంలోని అయిదు సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 
విత్తనానికి ఢోకా లేదు (ప్రకాశం)

జిల్లా వ్యవసాయశాఖ సంచాలకుని ఆదేశానుసారం మండల కేంద్రంలో హబ్, సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుకు వ్యవసాయాధికారులు భవనాలను పరిశీలించారు. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, లేనిపక్షంలో దాతల సాయంతో, వారు ముందుకు రాకపోతే అద్దెకు తీసుకొనే ప్రైవేటు భవనాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. మండల కేంద్రంలో హబ్‌ ఏర్పాటుకు 2,000 నుంచి 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా భవనాలు చూడాలని మార్గదర్శకాలు అందాయి. రైతు భరోసా కేంద్రం ఏర్పాటుకు 1,000 నుంచి 1,100 చ.అ.వి. ఉండే వాటిని సేకరించాల్సి ఉంది. వ్యవసాయశాఖ సబ్‌డివిజన్‌ సహాయ సంచాలకులు ఆయా భవనాలను పరిశీలించి తుది నివేదికను ఏడీ కార్యాలయానికి అందజేయాలి. ఆయా భవన చిత్రాలను పవర్‌ పాయింట్‌ ద్వారా జిల్లా కేంద్రానికి పంపాలి. జిల్లాలో 2020, జనవరి 1 నాటికి 56 హబ్‌లు, 280 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న హబ్‌లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నిల్వ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రోస్‌కు అనుమతులు ఇవ్వనున్నారు. హబ్‌లోని నిల్వలను రైతు భరోసా కేంద్రంలో వచ్చిన ఆర్డర్ల ప్రకారం రైతులకు సరఫరా చేయనున్నారు. మండల కేంద్రంలోని హబ్‌లో ఇద్దరు ఎంపీఈవోలు విధులు నిర్వర్తించనున్నారు. గ్రామ సచివాలయాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు అందుబాటులో ఉంటారు. రైతుల నుంచి ఆర్డర్లు స్వీకరిస్తారు. ఆయా మందులు, ఎరువులు, విత్తనాలను హబ్‌ నుంచి తెప్పించి రైతులకు అందజేస్తారు. రైతు భరోసా కేంద్రంలో పంటల సాగుపై సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు శిక్షణ ఇస్తారు. పంటల సాగుపై దృశ్య, శ్రవణ ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తారు. మినీ మట్టి నమూనా పరీక్షా కేంద్రం, ప్రత్యక్ష ప్రదర్శన క్షేత్రాలు, విత్తన గ్రంథాలయాలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. గిద్దలూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌లో హబ్‌లు ఏర్పాటు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. గిద్దలూరులో ఏఎంసీ ఆవరణ, రాచర్ల పోలీసుస్టేషన్‌ సమీపంలోని ప్రభుత్వ భవనం, బేస్తవారపేట, కొమరోలు మండలాల్లో అద్దె భవనాలు సేకరించనున్నారు. మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుకు గిద్దలూరు, రాచర్ల, బేస్తవారపేటలో అద్దె భవనాలు పరిశీలించగా- కొమరోలులో మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. గిద్దలూరు మండలంలో ముండ్లపాడు, కృష్ణంశెట్టిపల్లె, ఉయ్యాలవాడ, పొదలకుంటపల్లె; బేస్తవారపేట మండలంలో మోక్షగుండం, సలకలవీడు, పిటికాయగుళ్ల, గలిజేరుగుళ్ల; కొమరోలు మండలంలో రాజుపాలెం, దద్దవాడ, చింతలపల్లె, రెడ్డిచెర్ల; రాచర్ల మండలంలో ఆకవీడు, గుడిమెట్ట, పాలకవీడు, యడవల్లి సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.