సంక్రాంతి బరులు కు అంతా సిద్ధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంక్రాంతి బరులు కు అంతా సిద్ధం

భీమవరం, డిసెంబర్ 18, (way2newstv.com)
సంక్రాంతికి మరో నెల రోజుల సమయముంది.పందెం కోళ్లకు సుమారు సంవత్సరం కాలంగా ఖరీదైన ఆహారంతో పాటు ఈత, ఇతర వ్యాయామాలు నేర్పిస్తున్నారు. కోళ్లు పెంచే చోట చిన్న చిన బరులు ఏర్పాటు చేసి పందెంలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో కోడి పుంజుల్ని ఇళ్ల వద్ద, చేల గట్ల వద్ద, తోటల్లో పెంచే వారు. ఇప్పుడు బరులు జరిగే ప్రాంతంలోనే పుంజుల పెంపకం మొదలైంది. గిరాకీని బట్టి ప్రత్యేక ఫారాలు ఏర్పాటు చేసి మూడు నెలల నుంచి కోళ్లను అక్కడ మేపుతున్నారు.ఇంకా పండుగ నెల మొదలు కాకుండానే జిల్లాలో అప్పుడే కోడి పందాలు, కోతాట, గుండాటలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతేడాది కోడిపందాల నిర్వహణపై కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో పోలీసు కేసులు నమోదైనా పందెం రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 
సంక్రాంతి బరులు కు అంతా సిద్ధం

ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో తమకు ఎవరూ అడ్డు చెప్పరనే ధీమాతో రెట్టింపు ఉత్సాహంతో పందెంరాయుళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో పందెం కోళ్ల పెంప కం ఎక్కడక్కడో జరిగేవి. ఇప్పుడు బరుల వద్దే పెంచు తూ ఏ క్షణమైనా పందాల నిర్వహణకు సిద్ధమంటున్నారు. ఈ సారి పందాలు జోరుగా సాగుతాయనే అభిప్రాయంతో పందెం రాయుళ్లు ఉన్నారు. తణుకు నియోజకవర్గాన్నే తీసుకుంటే గతేడాది ఇరగవరం మండలంలో 8 బరులు, అత్తిలి మండలంలో 6 బరులు, తణుకు పట్టణం, రూరల్‌ మండలంలో 20 బరుల్లో పందాలు జరిగినట్లు పోలీసు నివేదికలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య పెరిగే అవకాశముందని నాయకులు చెబుతున్నారు రాగులు, జొన్నలు, ఇతర ధాన్యాలతో పాటు జీడిపప్పు, బాదంపప్పు, మటన్‌ కీమా పెట్టి పందాలకు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం గెలుపొందిన, గాయపడ్డ పుంజుల్ని ఈ సంవత్సరం బరిలోకి దించేందుకు ప్రత్యేక ఆహారం పెడుతున్నారు.కోడి పందాల వద్ద గుండాట, పేకాట వంటివి ఏర్పాటు చేసుకునే పనిలో బరుల నిర్వాహకులు ఉన్నారు. దీని కోసం అనుభవమున్న వారిని ఇప్పటికే బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కోడి పందాలతోనే మూడు రోజులు బరుల నిర్వహణ గిట్టుబాటు కాదని, గుండాట, కోతాట వంటి వాటి ద్వారా ఆదాయం పొందవచ్చనే ఆలోచనతో నిర్వాహకులున్నారు. గతంలో ఒక్కో బరి నిర్వాహకుడు రూ. 1 లక్ష నుంచి 10 లక్షల వరకూ ఆర్జించినట్లు పేర్కొంటున్నారు. సంప్రదాయం పేరుతో నిర్వహించే ఈ కోడి పందాలకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. వీటిని చూసేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు రావడంతో ఏమీ చేయలేపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. పోటీల ముసుగులో కొందరు పోలీసులకు సొమ్ము ముడుతుండడంతో సంక్రాంతి పూర్తయ్యే వరకూ తమను బదిలీ చేయవద్దని ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నారు.