కడప, డిసెంబర్ 30, (way2newstv.com)
జగన్ “సీన్‌లోకి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. “ అన్నట్టుగా ఉంది ఏపీ సీఎం జగన్ వ్యూహం. ఆయన వేస్తున్న అడుగులు వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షాలకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తుందనే వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కొన్ని జిల్లాలను ఆయన క్లీన్ స్వీప్ చేశారు. ముఖ్యంగా తన సొంత జిల్లా కడపలో మొత్తం తుడిచి పెట్టేశారు. ఇక, ఇప్పుడు ఆరు మాసాల సమయంలోనే జగన్ తన సొంత జిల్లా సహా సీమప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీమలోని నాలుగు జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక్క అనంతపురంలో టీడీపీ ఒకింత పరువు దక్కేలా రెండు సీట్లు వచ్చాయి.మిగిలిన మూడు జిల్లాల్లో వైసీపీ జోరు భారీగా సాగింది. అయితే, మరి ఇంత అభిమానం చూపించిన సీమ ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పం సహజంగానే జగన్‌లో ఉంది.
సిమ జిల్లాలపై జగన్ గురి
ఈ క్రమంలోనే ఆయన ఆరు మాసాలు గడిచేసరికి కీలకమైన కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. వాస్తవానికి దీనికి కేంద్రం నుంచి నిధులు రావాలి. కానీ, ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు. అయితే, ఇక్కడ ఫ్యాక్టరీని కట్టడం ద్వారా వచ్చే మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోవడం ద్వారా స్థానికంగా 75 శాతం ఉద్యోగ కల్పన జరుగుతుందని, ఫలితంగా సీమ ప్రాంతాల నుంచి జరిగే వలసలకు బ్రేక్ పడుతుందని జగన్ భావిస్తున్నారు.అదే సమయంలో సీమకు సాగు నీటిని అందించేందుకు కూడా గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా అందించాలనే కీలక నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని అంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే రు. 450 కోట్లతో సీమ రహదారులకు కీలక ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఇక, రాజకీయంగా కూడా కీలక నాయకులకు పదవులు ఇచ్చారు. మైనార్టీ సహా అన్ని వర్గాలకు ప్రాధాన్యం పెంచారు. మొత్తంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు సహా చేస్తున్న కార్యక్రమాలు కూడా వైసీపీ హవాను మరింత పెంచుతాయని సీమ ప్రాంత రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే టీడీపీ బలంగా ఉన్న అనంతపురంలో తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు. కడపలో జంపింగులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతో టీడీపీ కుదేలవడం, వైసీపీ మరింత పుంజుకోవడం ఖాయమనే వాదనకు బలం చేకూరుతోంది