ట్రాక్ పనులతో ట్రైన్ ఆలస్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్రాక్ పనులతో ట్రైన్ ఆలస్యం

ఖమ్మం, డిసెంబర్ 6, (way2newstv.com)
భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు వెళ్లే సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. డోర్నకల్‌ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న రైల్వే ట్రాక్‌ పనుల వలన సింగరేణి ప్యాసింజర్‌ గంట ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైం షెడ్యూల్‌ 2020 మార్చి వరకు కొనసాగనుంది. అయితే ఆ తర్వాత కూడా ఉన్నతాధికారులు కొనసాగించమంటే..అదే షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు. గతంలో ఈ బండి తెల్లవారుజామున 05:45 గంటలకు కొత్తగూడెం నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఉదయం 06:45 గంటలకు షురూ అవుతోంది. 
 ట్రాక్ పనులతో ట్రైన్ ఆలస్యం

డోర్నకల్‌ సమీపంలోని స్టేషన్ల మధ్యలో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతుల కారణంగా రైలు నడిచే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే..ఈ ఆలస్యంతో నిత్యం రాకపోకలు సాగించేవారు చాలా అసౌకర్యం చెందుతున్నారు.ఈ రైలు ఎక్కి డోర్నకల్‌ స్టేషన్‌కు వెళ్లి..అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 05:45 గంటలకు రైలు వెళ్లినప్పడు డోర్నకల్‌ స్టేషన్‌లో హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే రైళ్లు ఉండేవి. ప్రస్తుతం మార్పు చేసిన సమయంతో..ఆ ట్రెయిన్లు దొరకట్లేదు. ముఖ్యంగా శాతవాహన, గోల్కొండ, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు..అందట్లేదని వాపోతున్నారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. రైల్వే అధికారులు చర్యలు చేపట్టి, పాత సమయంలోనే సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలును కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.డోర్నకల్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌ పనులు,  సాంకేతిక లోపాల మరమ్మతులు చేస్తున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 2020 మార్చి వరకు అని భావిస్తున్నారు. అయితే..మే వరకు కూడా పనులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.సింగరేణి కార్మికులు ఉండే ప్రాంతాలను కలుపుతూ నడిచే సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ను ఈ ఏడాది మార్చి 26న రద్దు చేశారు. దీని స్థానంలో పుష్‌పుల్‌ రైలును వేశారు. అందులో టాయిలెట్లు లేక, సామగ్రి పెట్టుకునే ఏర్పాట్లు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకులు చేసిన పోరాటాలు, రైల్వే అధికారులకు ఇచ్చిన వినతుల ఫలితంగా మళ్లీ గత అక్టోబర్‌ 8వ తేదీన సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ను అధికారులు పున:ప్రారంభించారు. తాజాగా గంట ఆలస్యం ఆంక్షలతో ప్రయాణికులు మళ్లీ మదన పడుతున్నారు. ఇతర రైళ్లను సరైన సమయంలో అందుకోలేకపోతున్నామని అంటున్నారు.