చిత్తూరు, డిసెంబర్ 13, (way2newstv.com)
వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే ప్రభుత్వంలో హవా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు చిత్తూరు జిల్లాను శాసిస్తున్నదీ ఆయనే. నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచారు. అన్ని రకాలుగా ఆయనకు అండగా ఉన్నారు. దీంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారన్న విషయంలో ఎవరికీ ఎటువంటి డౌట్ లేదు.కాకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తక్కువ మాట్లాడతారు ఎక్కువ చేస్తారు అన్న పేరు పార్టీలోనూ ఉంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల జిల్లా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొని ఉందంటున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఒక్క చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది.
నిధులన్నీ.. ఆ రెండు నియోజకవర్గాలకేనా.....
ఇందుకు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పక తప్పదు.అందుకే చిత్తూరు జిల్లాలో మరో మంత్రి నారయణస్వామిని డమ్మీగా చేసి పెత్తనమంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు ఎక్సటర్నల్ ఎయిడెడ్ ప్రోగ్రాం కింద రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు 859 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ నిధుల్లో ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాధరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, తంబళ్ల పల్లి నియోజకవర్గాలకే తరలిపోయాయని మిగిలిన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. 14 నియోజకవర్గాలకు 859 కోట్లు మంజూరయితే పుంగనూరు నియోజకవర్గంలో 350 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి 212 కోట్ల ను పెద్దిరెడ్డి కేటాయించుకున్నారు.ఇక పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానధరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లి నియోజకవర్గానికి 211 కోట్లను కేటాయించారు. అంటే 859 కోట్ల నిధుల్లో సగం పెద్దిరెడ్డి సోదరులే తమ నియోజకవర్గాలకు పంచుకున్నారన్నమాట. మంత్రిగా ఉన్న నారాయణస్వామి నియోజకవర్గమైన జీడీ నెల్లూరుకు 80 కోట్లను కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాలకు అడపా దడపా నిధులను కేటాయించడంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి బయలుదేరింది. చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కూడా పెద్దగా నిధులు అందకపోవడంతో వారు జగన్ వద్ద ఈ ప్రస్తావన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనంతో తమకు నిధులేవీ రావడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలే వాపోతున్నారు.