ఉత్తరాంధ్రకు ఊపిరి వచ్చేసినట్టుందే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉత్తరాంధ్రకు ఊపిరి వచ్చేసినట్టుందే

శ్రీకాకుళం, డిసెంబర్ 19, (way2newstv.com)
ఉత్తరాంధ్ర జిల్లాలు ఎపుడూ వెనకబాటుతనంతోనే నానా అవస్థలు పడుతున్నాయి. 11 జిల్లాలతో మద్రాస్ నుంచి అంధ్రరాష్ట్రం అవతరించిన నాటి నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అరవయ్యేళ్ళ పయనంలోనూ ఉత్తరాంధ్రాకు తీరని అన్యాయమే జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తీసుకుంటే అభివృధ్ధి అన్నది వీటికి తెలుసా అనిపించక మానదు. విభజన తరువాత ఉత్తరాంధ్రకు మహర్దశ వస్తుందనుకుంటే అది కూడా ఆరేళ్ళుగా ఎండమావి అయింది. విశాఖను రాజధాని చేస్తారని నాడు అంతా అనుకున్నారు. కానీ రాజకీయ పలుకుబడి లేకపోవడం వల్లనే విశాఖ నాడు బలి అయింది. మొత్తానికి ఇప్పుడు వైసీపీ సర్కార్ పుణ్యమానని విశాఖ పాలనారాజధానిగా కొత్త చరిత్రను సృష్టించే అవకాశం దక్కించుకుంటోంది.విశాఖ ఇపుడు ఉన్న పదమూడు జిల్లాల ఏపీలో అతి పెద్ద నగరంగా చెప్పుకోవాలి. 
ఉత్తరాంధ్రకు ఊపిరి వచ్చేసినట్టుందే

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సైతం ప్రభుత్వ కార్యక్రమాలను సైతం విశాఖ వేదికగా నిర్వహించేవారు. విశాఖలోనే అన్ని రకాల వసతులు ఉన్న సంగతి బాబుకు తెలుసు. అయినా సరే ఆయన రాజధానిని మత్రం విశాఖకు ఇవ్వలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. కేవలం విశాఖను వాడుకోవడం తప్ప ఈ నగరానికి ఏమీ చేయలేదన్న మాట అంతటా ఉంది. స్మార్ట్ సిటీగా ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృధ్ధి చెందుతున్న విశాఖకు పాలనా రాజధానిగా మార్చాలను జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయం ద్వారా విశాఖ హైదరాబాద్ తో సమానంగా అభివృధ్ధి చెందడం ఖాయమని అంతా అంటున్నారు.విశాఖను రాజధాని చేయాలని విభజన సమయంలోనే ఇక్కడ స్థానికులు గళం వినిపించారు. అయితే రాజకీయ నాయకులు ఎక్కువగా వలస వచ్చిన వారు కావడంతో విశాఖవాసుల కలలు కల్లలుగా మిగిలాయి. నిజానికి ఏపీకి ఇపుడు వస్తున్న ఆదాయంలో అధిక భాగం విశాఖ నుంచి వస్తోంది. అయితే విశాఖను ఆర్ధిక రాజధాని, కల్చరల్ కాపిటల్ అని చెప్పి మభ్యపెట్టారు తప్ప ఏం చేయలేకపోయారు. దాంతో విశాఖలో కనీసం అభివృధ్ధి కూడా లేకుండా పోయింది. ఇన్నాళ్ళకు తమ డిమాండ్ తీరిందని ఈ ప్రాంత ప్రజలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఉత్తరాధ్ర జిల్లాలకు కూడా ఈ ప్రతిపాదన వల్ల న్యాయం జరుగుతుందని జనం సంబరపడుతున్నారు.