ఆత్మస్తుతిలో అవంతి శ్రీనివాస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆత్మస్తుతిలో అవంతి శ్రీనివాస్

విశాఖపట్టణం, డిసెంబర్ 20 (way2newstv.com)
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ముందు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అదృష్టం బాగుండి వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మాట ఇచ్చిన ప్రకారం జగన్ ఆయన్ని మంత్రిగా చేశారు. ఆయన సైకిల్ దిగిపోయింది కూడా మంత్రి పదవి ఆశతోనేనని అందరికీ తెలిసిన‌ విషయమే. రాజకీయాల్లో సమీకరణలు, అవసరాలు ఎపుడూ కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఆ విధంగా చూసుకుంటే అవంతి శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. వెనకాల జగన్ పెట్టుకున్న టార్గెట్లు కూడా ఉన్నాయి. అయితే వాటి విషయం పక్కన పెట్టిన మంత్రి అవంతి శ్రీనివాస్ తాను దమ్మున్న ఎమ్మెల్యేని, అందుకే మంత్రి అయ్యానని చెప్పుకుంటున్నారు.విశాఖ జిల్లాలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే అందులో తాను మాత్రమే మంత్రి అయ్యానని, దానికి కారణం తనలో సత్తా ఉండడమేనని అవంతి శ్రీనివాస్ గట్టిగానే చెప్పుకుంటున్నారు. 
ఆత్మస్తుతిలో అవంతి శ్రీనివాస్

ఈ ఆత్మస్తుతి ఆయన ఏకంగా తన సొంత సామాజికవర్గం ముందే చేయడం విశేషం. కాపుల ఆత్మీయ సమావేశం విశాఖలో తాజాగా నిర్వహించారు. దానికి హాజరైన అవంతి శ్రీనివాస్ తన వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా తీసుకువచ్చారు. అయితే సామాజికవర్గ మీటింగులో రెడ్డి గారిని తేవడమేంటని సమావేశానికి వచ్చిన టీడీపీ, జనసేనలకు చెందిన కాపులు ఆగ్రహించారు. సరదా సమావేశం కాస్తా రసాభాసగా మారడంతో ఆగ్రహించిన అవంతి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు.అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా చేసిన మరికొన్ని కామెంట్స్ కూడా సొంత సామాజికవ‌ర్గంలో చర్చకు దారితీశాయి. నాకు కూడా ఆగ్రహం ఉంటుంది. మంత్రిని కాబట్టి తమాయించుకుంటున్నా, సహనంగా ఉంటున్నా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత కులం వారే మెచ్చడంలేదని అంటున్నారు. నిజానికి రాజకీయ నాయకులు ఎవరైనా కులం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అదీ కూడా సొంత కులం అంటే ఇంకా దగ్గర కావాలని చూస్తారు. అయితే అవంతి శ్రీనివాస్ మాత్రం రాజకీయ లౌక్యాన్ని కూడా పక్కనపెట్టి మరీ సొంత కాపులపైనే రంకెలు వేయడం అటు పార్టీలో, ఇటు కాపుల్లో కూడా చర్చగా ఉంది. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు విజయసాయిరెడ్డికి భజన చేయడంలో తప్పులేదు కానీ ఒక రెడ్డిని కాపుల సమావేశానికి ఎలా తీసుకువస్తారని ఆ కులస్థులు మండిపడుతున్నారు. పైగా తాను కూడా గట్టిగా మాట్లాడగలని సవాళ్ళు చేయడమేంటని కూడా అంటున్నారు.ఇంతకీ మంత్రి గారు కాపులను ఒక చోట చేర్చి తాను ఎంతవరకూ మద్దతు సాధించారు, పార్టీకి వారిని ఎంత చేరువ చేయగలిగారు అని ఆలోచించినపుడు నిరాశే జవాబు అవుతుంది. ఎవరైనా కులం బలంతో పాటు రాజకీయ మద్దతు బాగా ఉంటేనే ఉన్నత పదవులు అందుకుంటారు. అవంతి శ్రీనివాస్ కూడా కులం వల్లనే మంత్రి అయ్యానన్న సంగతి విస్మరించి తానే గొప్ప అన్న ధోరణిలో చేసిన కామెంట్స్ వల్ల కాపులు ఆయనకే కాదు, పార్టీకి కూడా దూరం అవుతున్నారని వైసీపీలో నేతలు కలవరపడుతున్నారు. మొత్తానికి అవంతి శ్రీనివాస్ జగన్ అనుకున్నట్లుగా ధీటుగా పనిచేయడం పక్కన పెడితే కాపులను కూడా దూరం చేసుకుంటున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.