అనంతపురం డిసెంబర్ 28 (way2newstv.com)
అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీసులు మరోసారి మంచి సేవలందించారు. నిండు గర్భిణీ అని చూడకుండా భర్త చితక్కొట్టగా నిస్సహాయ స్థితిలో ఉన్న భార్యను తక్షణమే ఆసుపత్రికి పోలీసు వాహనంలో తీసికెళ్లి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆ గర్భిణీ అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలా వున్నాయి.చిలమత్తూరు మండలం చాగలేరు పంచాయతీ పరిధిలోని పోతులప్పపల్లికి చెందిన 8 నెలల గర్భిణీ అయిన భారతిపై ఆమె భర్త శుక్రవారం రాత్రి దాడి చేశాడు. మద్యం సేవించి విచక్షణారహితంగా కడుపు పై కొట్టగా ఆమె వాంతులు చేసుకొని ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయ్యింది.
భర్త దాడిలో తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్న గర్భిణీని కాపాడిన పోలీసులు
ఆ గ్రామస్తుడు ఈ విషయాన్ని చిలమత్తూరు ఎస్ . ఐ సెల్ ఫోన్ కు సమాచారం అందించారు. మారుమూల పల్లె కావడం... వాహన సౌకర్యం లేకపోవడంతో చిలమత్తూరు ఎస్ ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, కానిస్టేబుల్ మంజునాథ్ లు హుటాహుటిన పోలీసు వాహనంలో ఆ గ్రామానికి వెళ్లారు. గర్భిణీని వెంటనే పోలీసు వాహనంలో బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడీ నుండీ హిందూపురం... ఆ తర్వాత అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ గర్భిణీ చికిత్స పొందుతోంది. గర్భిణీని తక్షణమే ఆసుపత్రికి పోలీసు వాహనంలో తీసికెళ్లి వైద్య సేవలందించిన చిలమత్తూరు ఎస్ ఐ వెంకటేశ్వర్లు బృందాన్ని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.