దూకుడు పెంచిన డీకే అరుణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దూకుడు పెంచిన డీకే అరుణ

హైద్రాబాద్, డిసెంబర్ 11  (way2newstv.com)
తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ మరోసారి లక్ష్మణ్‌కు రావొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్ పదవి ఈసారి తనదే అనే ధీమాలో మాజీమంత్రి డీకే అరుణ ఉన్నట్టు బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆమె ఈ మధ్యకాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌పై దూకుడుగా ముందుకు సాగుతున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై డీకే అరుణ ఈ స్థాయిలో ఆశలు పెట్టుకోవడానికి అసలు కారణం వేరే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.డీకే అరుణకు ఈ విషయంలో బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన రామ్‌మాధవ్ నుంచి స్పష్టమైన హామీ లభించిందనే టాక్ వినిపిస్తోంది. 
దూకుడు పెంచిన డీకే అరుణ

ఏపీ, తెలంగాణ బీజేపీ వ్యవహారాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌మాధవ్... రాష్ట్ర కొత్త బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తెలంగాణలో కేసీఆర్‌పై దూకుడుగా పోరాటం చేయాలంటే డీకే అరుణ వంటి నాయకులైతేనే బాగుంటుందని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది.డీకే అరుణ తెలంగాణ బీజేపీ చీఫ్ అయితే... తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గం బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై డీకే అరుణ అంతగా ఆశలు పెట్టుకోవడం వెనుక రామ్‌మాధవ్ ఉన్నారనే టాక్ బీజేపీ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి డీకే అరుణ పేరు కూడా బీజేపీ ప్రెసిడెంట్‌ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మహిళా నేత కావడం, కేసీఆర్‌పై ముందు నుంచి దూకుడుగా మాట్లాడే నాయకురాలు కావడంతో సహజంగానే ఆమె పేరు తెరపైకి వస్తోంది. డీకే అరుణకు పగ్గాలు అప్పగిస్తే, ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం బీజేపీకి క్యూ కడతారని, క్షేత్రస్థాయిలో కొత్త క్యాడర్‌ పార్టీకి జత కలుస్తుందని కొందరు అరుణ పేరును సూచిస్తున్నారట. బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ ఆశీస్సులు కూడా అరుణకు వున్నాయని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా, ప్రెసిడెంట్ పదవి కోసం హస్తినస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇలా ఎవరికి వారు బీజేపీ అధ్యక్ష పీఠం కోసం పావులు కదుపుతున్నారు.దిశా హత్యను నిందితులు మద్యం మత్తులోనే చేసారన్న వార్తల నేపథ్యంలో ఇందిరా పార్కు దగ్గర రెండు రోజుల దీక్ష చేయ‌బోతున్నారు మాజీ మంత్రి డీకే అరుణ. ఈ కార్యక్రమానికి ఆకుల విజయ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.. లోక్‌సభ ఎన్నికల తరువాత హైద‌రాబాద్‌లో పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించన మాజీ మంత్రి డీకే అరుణ.. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఆందోళన కార్యక్రమాలు చేప‌డుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యక్రమాల నిర్వహణలో ఆంతర్యమేంటన్నది పార్టీలో పెద్ద చ‌ర్చ అవుతోంది..పార్టీలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో పార్టీకి నూతన అధ్యక్షుడి ఎన్నిక కూడా జరుగబోతోంది. ఈ పోటీలో ప్రస్తుత అధ్యక్షుడు ల‌క్ష్మణ్ తర్వాత ఆ స్థానం కోసం పోరాడుతున్న రెండో వ్యక్తిగా డీకే అరుణే అన్న వార్తలు వినిపిస్తన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కూడా ఇద్దరు నేతలు పోటాపోటీగా లాబీయింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ లక్ష్మణ్‌కు అధిష్టానం ప‌ద‌విని రెన్యువల్ చేయ‌వ‌ద్దని భావిస్తే అధ్యక్ష పీఠం డీకే అరుణకే వ‌స్తుందన్న అభిప్రాయంలో ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు.ఆందోళ‌న కార్యక్రమాలతో అధిష్టానం దృష్టిలో పడితే మరోసారి మహిళా మోర్చా అధ్యక్షురాలు కావచ్చు అనేది ఆకుల విజయ మనసులో మాట అని తన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఉద్యమాలతో దూసుకుపోయే విధంగా ఫ్యూచర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్ దగ్గర వీరి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నెల 12, 13 తేదీల్లో భారీ జన సమీకరణతో దీక్షను విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మహిళ నేతలు. ప్రభుత్వాన్ని ఎదుర్కునేందుకు ఒక బలమైన వాయిస్ ఉండాలని.. అది మహిళది అయితే ప్రజ‌ల్లోకి మ‌రింత విస్తృతంగా వెళ్తుందన్న ద్దేశాన్ని అధిష్టానానికి కల్పించే విధంగా వీరు కార్యక్రమాలు చేపడుతున్నార‌ని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, అధ్యక్షుని ఎంపికపై పార్టీ మొత్తం గ్రూపులుగా విడిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి, అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కొందరు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి, దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నవారికి అవకాశం ఇవ్వాలని సీనియర్లు అధిష్టానానికి విన్నవిస్తున్నారు. అయితే, కొత్తవారైనా, పాతవారైనా సమర్థులుండాలని, పార్టీ ఎదుగుతున్న క్రమంలో, కొత్త నీరు అవసరమని కూడా, మరికొందరు అమిత్‌ షాకు చెబుతున్నారట. ఇలా పాతకొత్త గొడవలు, చాలాపేర్లు తెరపైకి వస్తుండటంతో, ఎవరిని ఎంపిక చేస్తే, ఏమవుతుందోనని, కాషాయ అధిష్టానం తలలు పట్టుకుంటోందట. చూడాలి, తెలంగాణ బీజేపీ అధ్యక్ష సింహాసనంపై ఎవరు కూర్చుంటారో, ఆ తర్వాత పార్టీలో పరిణామాలు ఏం జరుగుతాయో.