విజయవాడ, డిసెంబర్ 28, (way2newstv.com)
ఔను! వారిద్దరూ రెచ్చిపోతున్నారు.. అంటున్నారు బీజేపీలోని నాయకులు. మరి ఎవరి గురించి అంటే.. బీజేపీలోనే ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి గురించేనట. ఈ ఇద్దరి గురించి బీజేపీ నాయకులు తెగ చెవులు కొరికేసుకుంటున్నారు. `అదేంటి.. ఒకరు మాట్లాడిన వెంటనే మరొకరు మీటింగ్ పెట్టేస్తున్నారు. కనీసం స్టేట్ చీఫ్‌తో కూడా చెప్పకుండానే మీడియా సమావేశాలా?“ అంటూ బీజేపీ ఏపీ నాయకులు ఓ స్థాయిలో ఉన్నవారు తెగ ఫీలైపోతున్నారు. మరి ఇంతకీ ఎవరికీ పట్టని ఏపీని, జగన్ పాలనపైఎవరికీ లేని బాధను ఈ ఇద్దరే ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు ఏపీ బీజేపీలో ఇదే కీలక ప్రశ్న.అయితే, అటు రాజకీయాల్లోను ఇటు పారిశ్రామికంగాను సుజనా చౌదరి, పురందేశ్వరి కుటుంబాలు కీలకంగానే ఉన్నాయి.
పురందరేశ్వరి, సుజనా చౌదరి పోటీ ఎందుకోసం
పైగా ఇద్దరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి కమలం గూటికి చేరిన వారే. ఇద్దరి లక్ష్యమూ ఒక్కటే.. కేంద్రంలో పదవి కొట్టేయాలి! మరిఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు .. ఇద్దరికీ ఒకటే పెవిలియన్ ఉన్నప్పుడు చేసేది ఏంటి ? ఆధిపత్య రాజకీయం. అయితే, అది సొంత పార్టీలో ఆధిపత్యం కాకుండా తెలివిగా.. జగన్‌ను తిట్టడంలో ఆధిపత్యం సాధించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు.. ప్రయత్నిస్తున్నారు.అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ పెద్దల దృష్టిలో పడేందుకు కూడా సుజనా, పురందేశ్వరిలు పోటీ పడుతున్నారు. ఏపీలో జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను బీజేపీ నాయకులు సమర్ధించారు. ఆంగ్ల మీడియం సహా.. అమ్మ ఒడివంటి పథకాలను, నాణ్యమైన బియ్యం వంటి వాటిని విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు వంటి వారు బాహాటంగానే సమర్ధించారు. అయితే, ఇప్పుడు జగన్‌ను విమర్శిస్తోంది.. కేంద్రంపై దృష్టి ఉన్న నాయకులే. వీరిలో సుజనా, పురందేశ్వరి కీలకంగా ఉన్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత కేంద్రంలో కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది.ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు మోడీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఏపీలో ఎలాంటి ప్రాధాన్యం లేక పోవడంతో ఏపీ నుంచి సహాయ మంత్రి పదవి పోస్టు ఫిలప్ చేయనున్నారు. దీంతో ఈ పోస్టు కోసం సుజనా, పురందేశ్వరి పోటీ పడుతున్నారు. ఈక్రమంలోనే జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే 2014 ఎన్నికలకు ముందే బీజేపీలోకి వెళ్లిన పురందేశ్వరి ఈ పోరులో గెలుస్తారా ? లేదా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడాక బీజేపీలోకి వెళ్లి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోన్న సుజనా చౌదరి గెలుస్తారా ? అన్నది చూడాలి.