రాజధాని నేతలను కలుపుతున్న రచ్చ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధాని నేతలను కలుపుతున్న రచ్చ

గుంటూరు, డిసెంబర్ 28, (way2newstv.com)
వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో అగ్రనేతలు. అయితే ఆరు నెలల నుంచి వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ రాజధాని అమరావతి విషయంలో వారు బయటకు రాక తప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలందరూ దాదాపు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి.ఈ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకూ ఆరు నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఆయన చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాలకు కూడా హాజరుకాలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కూడా ప్రత్తిపాటి పుల్లారావు వెనకంజ వేశారు. 
రాజధాని నేతలను కలుపుతున్న రచ్చ

ఆయన పూర్తిగా దూరంగా ఉండి వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయంది కూడా.ఇక ధూళిపాళ్ల నరేంద్ర ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఆయన కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో టీడీపీకి దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు పర్యటనకు వచ్చినా ఆయన పాల్గొన లేదు. ధూళిపాళ్ల నరేంద్ర ఎక్కువగా సంగం డెయిరీ కార్యక్రమాలను చూసుకునేందుకు సమయం వెచ్చిస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు ఉన్నా కలిసేందుకు ఇష్టపడలేదు. తనకు టీడీపీలో అన్యాయం జరిగిందని ఆయన నేటికీ అసంతృప్తితో ఉన్నారు.అయితే ఆరు నెలల నుంచి దూరంగా ఉన్న ఈ నేతలిద్దరూ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన తర్వాత వీరు నిత్యం ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ తెలుగుదేశ పార్టీ నేతలు ఇద్దరికీ రాజధాని అమరావతిలో భూములున్నాయని, అక్రమంగా కొనుగోలు చేశారని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు నేతలు రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వీరిద్దరినీ అమరావతి కలిపిందన్న సెటైర్లు విన్పిస్తున్నాయి.