బయో డైవర్శటీపై ఫార్టీ స్పీడ్ లిమిట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బయో డైవర్శటీపై ఫార్టీ స్పీడ్ లిమిట్

హైద్రాబాద్, డిసెంబర్ 17 (way2newstv.com)
హైదరాబాద్ బయోడైవర్సిటీ వంతెన నిర్మాణంపై తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఏమిటో తెలిసింది. ప్రమాదాలకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన కమిటీని జీహెచ్ఎంసీ నియమించింది. ఫ్లై ఓవర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వంతెన నిర్మాణానికి సరిపడా భూసమీకరణ చేయకుండా రాజీపడినట్టు నివేదిక పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగానే వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ వేగంగా వెళ్లే వాహనాలకు అది సురక్షితం కాదని నివేదిక పేర్కొంది. వాహనాల వేగం 40 కిలోమీటర్లకు మించకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
బయో డైవర్శటీపై ఫార్టీ స్పీడ్ లిమిట్

నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలో వంతెన డిజైన్, నాణ్యత, ఇతర అంశాల గురించి పేర్కొన్నారు. వంతెన నిర్మాణంలో ఇంజనీర్లు మరింత ముందుచూపుతో వ్యవహరించి ఉంటే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్‌సీ) ప్రమాణాల ప్రకారమే వంతెన నిర్మాణం జరిగినప్పటికీ మలుపుల విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలను పక్కనపెట్టారని పేర్కొంది.బ్రిడ్జిపై వేర్వేరు చోట్ల, ఎత్తుల్లో వేగాన్ని నిరోధించేందుకు రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. వంతెనపై సెల్ఫీలు తీసుకోకుండా మూల మలుపు దగ్గర క్రాష్ బారియర్స్‌పై 1.5 మీటర్ల ఎత్తున పరదా లాంటి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. నివేదికలో సూచించిన చర్యలు పూర్తయిన తర్వాత నిపుణుల కమిటీ మరోమారు వంతెనను పరిశీలిస్తుంది. అనంతరం వంతెన ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.