కడప, డిసెంబర్ 10, (way2newstv.com)
జగన్ ఒక వైపే చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఏపీ లాంటి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్ ఆలోచనా విధానాన్ని చూసి ఆ విధంగా అంతా భావిస్తూ వచ్చారు. ఇక రాజకీయ పార్టీలైతే జగన్ కి ముందు చూపు లేదని, ఆయన ఏపీని మరింతగా అన్యాయం చేస్తున్నారని విమర్శలు లంకించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్ల రాజకీయమే చేస్తున్నారని, అందుకే వెల్లువలా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని కూడా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నేత సుజనా చౌదరి కూడా హాట్ కామెంట్స్ చేసారు. చంద్రబాబు అయితే ఏపీని మరో ఇరవయ్యేళ్ళ వెనక్కి జగన్ తీసుకెళ్తున్నారని, ఆయనకు ఎటువటి పాలనానుభవం లేకపోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని కూడా విమర్శిస్తున్నారు.
సంక్షేమమే కాదు...మరో కోణం
జనసేనాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ది ముందు చూపు లేని పాలన అంటూ ఆయన గుచ్చుకునే కామెంట్స్ చేశారు.జగన్ వీటన్నిటికి సరైన జవాబు ఇవ్వబోతున్నారుట. ఆయన తనదైన కార్యాచరణను కూడా ఇందుకోసం సిధ్ధం చేసుకున్నారని అంటున్నారు. దాన్ని తన సొంత జిల్లా కడప నుంచే జగన్ మొదలుపెడుతున్నారని అంటున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ కి శంఖుస్థాపన చేయడం ద్వారా అక్కడ అభివ్రుద్ధికి బాటలు వేస్తున్న జగన్ ప్రతీ జిల్లాను దాని సామర్ధ్యం, అవసరాలు గుర్తించి మరీ ప్రగతి రధాన్ని పరుగులు పెట్టిస్తారని అంటున్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ తరహాలో మరిన్ని పరిశ్రమలను సీమకు రప్పించాలని జగన్ చూస్తున్నారు. ఇక వాల్ మార్ట్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా కొన్ని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో రెండవ పోర్టు ఏర్పాటు కు పావులు కదుపుతున్న జగన్ విశాఖ అభివృద్ధి విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను నాలుగేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలనుకుంటున్నారు. అలాగే టూరిజం హబ్ గా విశాఖతో పాటు రాజమహేంద్రవరాన్ని కూడా తీర్చిద్దాలనుకుంటున్నారుట.ఇక విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటకి జగన్ సర్కార్ అడుగులు వేగంగా వేస్తోంది. స్థల సేకరణ చేయడం ద్వారా తొందరలో శంఖుస్థాపనకు రంగం సిధ్ధం చేస్తోంది. శ్రీకాకుళంలో కూడా భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో పాటు జిల్లాలో పారిశ్రామికపరంగా అభివ్రుధ్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కర్నూలులో హైకోర్టుని మంజూరు చేయడంతో పాటు విశాఖలో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయలాని కూడా ప్రతిపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే అభివ్రుధ్ధి పరంగా వేగంగా అడుగులు వేయడడం ద్వారా విపక్షాలకు తగిన రీతిన జవాబు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.