ఇసుకతోనే ఇక్కట్లు (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇసుకతోనే ఇక్కట్లు (కరీంనగర్)

కరీంనగర్, డిసెంబర్ 09 (way2newstv.com): 
నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.. నిధులకు మంజూరివ్వడంతో ఆ పనులు పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో కొన్ని పూర్తికాగా.. మరికొన్ని చోట్ల నెలల తరబడి వదిలేశారు. కనీసం రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడే తవ్వి వదిలేశారు. ప్రస్తుతం నిధులు మంజూరు కాగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారు. అయితే, ఇసుక కొరత పేరుతో అడ్డంకులు వస్తున్నాయి. కరీంనగర్‌ నగరపాలక సంస్థకు నగర పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మొదటి విడతలో రూ.100 కోట్లు, రెండో విడతలో రూ.147.23 కోట్లు, మూడో విడతలో రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రధాన, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, కల్వర్టుల నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. 
ఇసుకతోనే ఇక్కట్లు (కరీంనగర్)

పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూసేందుకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టారు. ఒకే శాఖతో పనులను చేపట్టకుండా అయిదు శాఖలకు అప్పగించారు. ఏ శాఖకు ఆ శాఖ లక్ష్యం విధించారు. ప్రజారోగ్య శాఖతో పాటు మిగతా నాలుగు శాఖల్లో సాంఘిక సంక్షేమ శాఖకు 1-5 డివిజన్లు, నగరపాలక సంస్థకు 6-20 డివిజన్లు, 41-50 డివిజన్లు, ఆర్‌ఆండ్‌బీ 21 నుంచి 30 డివిజన్లు, పంచాయతీరాజ్‌ 31 నుంచి 40 వరకు డివిజన్లు ఉన్నాయి. మొత్తం 566 పనుల్లో 176 పూర్తి చేశారు. మిగతా పనులు వివిధ దశల్లో ప్రారంభించి వదిలేశారు. ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు సైతం ముందుకొచ్చి టెండర్‌లలో పాల్గొని పనులు నిర్వహించారు. అత్యధిక చోట్ల సీసీ, తారు రోడ్లు పూర్తికాగా మిగతా ప్రాంతాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు తవ్వి వదిలేయడంతో రాకపోకలు సాగించే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల ముందుకు కనీసం వాహనాలు రాని పరిస్థితి.. హౌజింగ్‌బోర్డుకాలనీ, వినాయకనగర్‌, కట్టరాంపూర్‌, అలకాపురి కాలనీ, భగత్‌నగర్‌, రాంచంద్రాపూర్‌ కాలనీ, విద్యానగర్‌, లక్ష్మీనగర్‌, కోతిరాంపూర్‌ ప్రాంతాల్లో రహదారుల పనులు ప్రారంభించి వదిలేశారు. ఈ పనులు పూర్తి చేసేందుకు నిధుల కొరత ఏర్పడింది. ఆరు నెలలకు పైగా పనులు నిలిపి వేశారు. నగరాభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్లకు ఊరట లభించింది. సుమారు రూ.70 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా అందులో రూ.30 కోట్లు మంజూరు చేశారు. అందులో రూ.25 కోట్లు నగరంలోని 50 డివిజన్‌లలో గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చారు. పూర్తి స్థాయిలో బిల్లులు రాకున్నప్పటికీ ఆర్థిక సమస్యలు అధిగమించడానికి రూ.25 కోట్లను పనులు చేసిన కాంట్రాక్టర్లకు పంపిణీ చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే తవ్వి వదిలేయడం, కంకరపోయడం, భూగర్భ ఛాంబర్లు నిర్మించి వదిలేయడం, మట్టిపోయడంతో ఆయా ప్రాంతవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాకాలంలో బురద, నీరు నిల్వ ఉండటం, ప్రస్తుతం దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్నారు. పనులు చేపట్టడానికి బిల్లులు మంజూరు చేసినా, ఇసుక కొరత పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. వాస్తవంగా ఒక్కో ట్రాక్టర్‌ ధర ప్రస్తుతం రూ.4500 ట్రిప్పు ఉందని, గతంలో ఒక్కో ట్రిప్పునకు రూ.1500 నుంచి రూ.2వేలలోపు ఉండేదని అంటున్నారు. అధికారులు మాత్రం ఒక క్యూబిక్‌ మీటర్‌కు రూ.1100 చెల్లిస్తోంది. ఇసుక కొరత పేరుతో కాంట్రాక్టర్లు సాకు చూపుతుండటంతో అసంపూర్తి పనులు చేపట్టి వదిలేసిన కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రంగంలోకి దిగి తహసీల్దార్‌తో మాట్లాడి ఇసుక ఇప్పిస్తే పెండింగ్‌ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. జిల్లా పాలనాధికారి, కమిషనర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు ఆ దిశగా ఆలోచించాల్సి ఉంది.