బెంగళూర్, డిసెంబర్ 19 (way2newstv.com)
సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత. ఆయన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడ లొసుగులు ఉన్నాయో ఇట్టే పసిగట్టేయగలరు. ఆయనకు పార్టీలో కిందిస్థాయి క్యాడర్ నుంచి నేతల వరకూ ఆసాంతం జాతకాలు తెలుసు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం రెండు సీట్లలోనే కాంగ్రెస్ గెలవడంతో అవమాన భారం దిగమింగుకోలేక శాసనసభ పక్ష నేత పదవికి రాజీనామా చేశారు. అయితే సిద్ధరామయ్య ఊరికే ఉంటారా? పదవి లేకుండా కాలం గడుపుతారా? అన్నది సందేహమే.ఏదో ఒక పదవి ఉంటేనే నేతలు బెల్లం చుట్టూ ఈగల్లా వాలతారని సిద్ధరామయ్యకు తెలియంది కాదు. అందుకే ఆయన పదవికి రాజీనామా చేసినా కాంగ్రెస్ నేతల చేత బతిమాలించు కుంటున్నారు. తనని కాదని వేరే వారికి నాయకత్వం ఇస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ఇక కోలుకోలేదన్న సంకేతాలు కూడా సిద్ధరామయ్య పంపుతున్నారు.
సిద్ధిరామయ్య...పక్కా ప్రణాళిక...
కీలక పదవుల్లో తనకు వ్యతిరేకులను నియమిస్తారన్న ఆందోళనతో సిద్ధరామయ్య ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే సిద్ధరామయ్య తాను ఢిల్లీకి వెళ్లి పెద్దలతో చర్చించే ముందే ఆయన అధిష్టానానికి లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుపుతూ లేఖ రాశారు. పదిహేను నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే సీనియర్లు పట్టించుకోలేదని అధిష్టానానికి సిద్ధరామయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపగలిగిన నేతలు కూడా ప్రచారం నిర్వహించలేదన్నారు. తన మీద కోపంతో పార్టీని ఉప ఎన్నికల్లో నిర్లక్ష్యం చేశారని సిద్ధరామయ్య హైకమాండ్ కు పంపిన నివేదికలో పేర్కొన్నారని తెలిసింది.ఈ ఎన్నికల్లో సీనియర్ల కంటే ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువగా కష్టపడ్డారని, ఎవరెవరు కాంగ్రెస్ విజయం కోసం కృషి చేశారో వారి పేర్లను కూడా సిద్ధరామయ్య నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్ధరామయ్య తన టార్గెట్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, డీకే శివకుమార్ లను టార్గెట్ చేసుకున్నట్లు కనపడుతోంది. సంకీర్ణ సర్కార్ ఉన్నప్పుడు కూడా వీరిద్దరూ కుమారస్వామికి దగ్గరై పార్టీ నేతలను పట్టించుకోలేదని ఆయన చెబుతుంటారు. మొత్తం మీద సిద్ధరామయ్య ఓటమి పాలయినప్పటికీ అందుకు కారణం తాను కాదని అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేసినట్లే కనపడుతోంది. తద్వారా తన సీఎల్పీ పదవిని కాపాడుకోవడానికేనన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి.