పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు

దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం
రాష్ర్టస్ధాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో ప్రసంగించిన మంత్రి
హైదరాబాద్ డిసెంబర్ 20 (way2newstv.com)
పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి సులభంగా అత్యంత పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు బుద్దభవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి టౌన్ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ భవిష్యత్తు కార్యాచరణను, అందులో టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుంచి ఆశిస్తున్న పనితీరుపైన కూలంకశంగా వివరించారు.  దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ శాఖ సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించి, అత్యంత పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇచ్చే నూతన విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని మంత్రి తెలిపారు.  
పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు

ఈ విధానంలో రాష్ట్రంలో 75 గజాల లోపు భవన నిర్మాణం చేపట్టే వారికి కేవలం రిజిస్ర్టేషన్ చేసుకుంటే సరిపోతుందని, 600 గజాలలోపు భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం, 600 గజాలపైన భవన నిర్మాణ అనుమతులకు సింగిల్విండో పద్ధతిలో అనుమతులకు ఈ నూతన విధానం వీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు.  సాంప్రదాయికంగా ఉన్న అనుమతుల ప్రక్రియను పూర్తిగా మార్చేటప్పుడు, కొన్ని సవాళ్లు ఎదురవుతాయని, అయితే ముఖ్యమంత్రి కెసియార్ గారి లాంటి నాయకత్వం, మార్గదర్శనంలో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో పరిశ్రమల శాఖ అనుమతుల విధానం పూర్తిగా మార్చి సింగిల్విండో పద్ధతి విధానాన్ని తీసుకొచ్చి విజయం సాధించామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే విధంగా అత్యంత పారదర్శకంగా ఉండే భవన నిర్మాణ అనుమతుల విధానాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అనుమతుల ప్రక్రియలో సమయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.  నూతన విధానంలో ప్రజలు మరియు అధికారులపైన అత్యంత విశ్వాసం నుంచి ఈ నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ప్రజలు ఈ విధానాన్ని దుర్వినియోగం చేసి, తప్పుడు అనుమతులు తీసుకున్నా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని ఎలాంటి నోటీసు లేకుండ కూల్చే అధికారం నూతన పురపాలక చట్టంలో ఉందని, ఈ విషయాన్ని ప్రజల దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులదే అని అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నూతన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలకు పూర్తి బాధ్యత అధికారులు వహించాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు. టౌన్ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలపైనా కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను ఉపేక్షించబోమని తెలిపారు. నూతన పురపాలక చట్టంలో పురపాలక ఉద్యోగులు, పాలక మండళ్లపైనా కఠిక చర్యలు తీసుకునే వీలున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలోగ్గాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంలో సిబ్బందికి నేను అండగా ఉంటానని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకురానున్న నూతన విధానంలో ప్రజల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా పని చేద్దామని కోరారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్  సిబ్బంది ఖాళీల భర్తీ, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.మెరుగైన జీవన ప్రమాణాలు ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పట్టణాలవైపు చూస్తున్నారని, పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాలు మౌలిక వసతుల కల్పనతో పాటు, పట్టణాన్ని సమగ్ర కార్యచరణతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్  అధికారుల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని మంత్రి అన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పురపాలక చట్టం దోహదం చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి పురపాలికకు ఒక మాస్టర్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన క్యాలెండర్ను కూడా తయారు చేయాలని డిటిసిపి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఆరు పట్టణాభివృద్ధి సంస్థలు, ప్రస్తుతం హెచ్ యండిఏ విజయవంతంగా అనుసరిస్తున్న  ల్యాండ్ పూలింగ్ వంటి పద్ధతులను అనుసరించాలని కోరారు.ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు హైదరాబాద్ సిసిపి దేవేందర్ రెడ్డి, మరియు డిటిసిపి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.