కర్నూలు, డిసెంబర్ 6, (way2newstv.com)
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి రైతుల పంట పండుతోంది.దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు ప్రజల్లో ఉల్లిపై డిమాండ్ భారీగా పెరుగుతోంది. తాజాగా సోమవారం కర్నూలు జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి ధర గరిష్ట స్థాయిలో పలికింది. క్వింటాల్ ఉల్లి ధర రూ. పది వేలకుపైగా అమ్మకం జరిగింది. రికార్డు స్థాయిలో పెరిగిన ఉల్లి ధరలతో.. ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు.
పది వేలు దాటిన ఉల్లి ధరలు
గతంలో క్వింటాల్ ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.5,400 మాత్రమే. ప్రస్తుతం రూ.10,180 ధర పలకడం విశేషం. ఉల్లి పంటకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పేరు చెబితే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ఈ జిల్లాపై జాతీయ స్థాయి వ్యాపారుల దృష్టి పడింది. జిల్లాలో పండిన ఉల్లి ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుండటంతో ధరలు ఎగిసి పడుతున్నాయి.రెండు, మూడేళ్లుగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరగడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆదివారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్‌కు అత్యధిక ధర రూ.7,570 పలికింది. సోమవారం రూ.10,180కి ఎగబాకింది. రాష్ట్రంలో పండుతున్న ఉల్లిలో 95 శాతం కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. జిల్లాలో 2018–19లో 34,158 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 7,85,634 టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో 32 వేల హెక్టార్లలో పంట సాగు కాగా.. 7,04,000 టన్నులు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల ఎకరాల్లో సాగు తగ్గగా.. ఉత్పత్తి 81,634 టన్నులు తగ్గింది.