రేవంత్ రెడ్డికు లైన్ క్లియర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రేవంత్ రెడ్డికు లైన్ క్లియర్

హైద్రాబాద్, డిసెంబర్ 6, (way2newstv.com)
రేవంత్ రెడ్డికి అన్నీ సానుకూలంగా ఉన్నా కొత్తగా పార్టీలోకి వచ్చారన్నదే ఒక్కటే మైనస్. ఇప్పుడు ఆయన పదవికి అదే అడ్డంకిగా మారే అవకాశముంది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం హైకమాండ్ ఇప్పటికే అనేక పేర్లను పరిశీలిస్తుంది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత దీనిపై ప్రకటన వచ్చే అవకాశముందని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీలో పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు.పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి రేసులో ముందున్నారని చెప్పక తప్పదు. కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనడం, తెలంగాణ ప్రజలను మాటలతో ఆకట్టుకోవాలంటే రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమని పార్టీలోని అనేకమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. 
రేవంత్ రెడ్డికు లైన్ క్లియర్

ముఖ్యంగా సీనియర్ నేత షబ్బీర్ అలి లాంటి వాళ్లు కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఓటమి పాలయిన కాంగ్రెస్ మరో సారి అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే ఇక కోలుకోవడం కష్టమే. అందుకే సీనియర్ నేతలు సయితం రేవంత్ రెడ్డికి జై కొడుతున్నారంటున్నారు.కానీ కొందరు నేతలు మాత్రం రేవంత్ రెడ్డికి పీసీీసీ చీఫ్ ఇవ్వ వద్దని హైకమాండ్ వద్ద పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారిని పీసీీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీనుంచి తప్పుకుంటామని కూడా వి.హనుమంతరావు వంటి నేతలు హెచ్చరికలు పంపుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీలో సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి సయితం పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తనకు పదవి ఇస్తే పార్టీకి పూర్వ వైభవం తెస్తానని చెబుతున్నారు.మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా అణగారిన వర్గాలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇందుకోసం దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క వంటి వారి పేర్లను పరిశీలించాలని కూడా హైకమాండ్ పై వత్తిడి పెరుగుతోంది. అయితే పీసీపీ చీఫ్ పదవి ఉండేది కేవలం రెండేళ్లు మాత్రమే. అందుకే తొలి రెండేళ్లు ఎవరికి ఇచ్చినా, ఎన్నికలకు ముందు మాత్రం చరిష్మా ఉన్న నేతకు ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పీసీపీ చీఫ్ ఎంపికలో ప్రముఖ పాత్ర పోషించనున్నారు. రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఢిల్లీలో బాగానే విన్పిస్తుంది