యదేఛ్చగా గంజాయి వ్యాపారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యదేఛ్చగా గంజాయి వ్యాపారం

విజయవాడ, డిసెంబర్ 17, (way2newstv.com)
విజయవాడ కేంద్రంగా గంజాయితోపాటు, మత్తు పదార్థాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నందిగామ, జగ్గయ్యపేటకు చెందిన పలువురు విశాఖపట్నం నుంచి గంజాయితోపాటు, ఇతర మత్తుపదార్థాలను తీసుకువచ్చి వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల ప్రాంతాల్లో పలు కళాశాలకు చెందిన విద్యార్థులకు మత్తుపదార్థాలు అందజేసి విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసలు చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా కళాశాలలో చదివే విద్యార్థులను టార్గెట్‌ చేసి ఈ వ్యాపారం సాగించటం వల్ల పలువురు విద్యార్థులు మత్తుకు బానిసై చదువులు మానేసి బంగారు భవిష్యత్తులను పాడుచేసుకుంటున్నారు. 
యదేఛ్చగా గంజాయి వ్యాపారం

మత్తుపదార్థాల వ్యాపారం చేసే వారు విద్యార్థులకు అంటకట్టటమే కాకుండా వారి ద్వారా కూడా విజయవాడ తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. కళాశాలలో చదువుకోవటానికి వచ్చిన విద్యార్థులు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించి, కార్లు, ద్విచక్రా వాహనాల్లో ప్రయాణిస్తు ప్రమాదాలకు గురై గాయపడ్డ సంఘటనలూ ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్‌ కళాశాల వార్షికోత్సవానికి వచ్చిన విద్యార్థులు మత్తుపదార్థాలు సేవించి ఆ మత్తులో ద్విచక్రా వాహనంపై విజయవాడ వెళ్ళుతూ, ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో కోకొల్లలుగా ఉన్నాయి. నందిగామకు చెందిన పలువురు యువకులు విద్యార్థులకు మత్తుపదార్థాలను అందజేసేందుకు కారులో బయలుదేరి అతివేగంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురైన సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. దీంతో ఆ సమయంలో వారి వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లను కనుగొన్న పోలీసు ఆ కోణంలో విచారణ చేపట్టారు. అలాగే నందిగామ జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన పలువురు రవాణా రంగంలో పనిచేసే కార్మికులకు మత్తుపదార్థాలను అట్టకడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో వందలాది లారీలు ఉండటంతో రవాణా రంగంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న డ్రగ్స్‌ మాఫియా కార్మికుల్లో కలిసిపోయి వారికి కూడా మత్తుపదార్థాలు అలవాటు చేస్తున్నారు. శుక్రవారం నందిగామలో డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిఐ రవికుమార్‌, పోలీసు సిబ్బంది కలిసి నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం చేస్తున్న ఐదుగురి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని వారిని విచారించగా విశాఖ నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా విద్యార్థులు, రవాణా రంగంలోని కార్మికులకు అంటకడుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. గంజాయితో పాటు డ్రగ్స్‌ వ్యాపారం చేసేవారంతా 30 ఏళ్ళ లోపు యువకులే కావటంతో దీనికి వెనుక అసలు సూత్రధారులు ఎవ్వరు అనేది తేలియాల్సి ఉందని పలువురు అంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన పెద్దల హస్తం లేకుండా డ్రగ్స్‌ వ్యాపారం ఇంతగా సాగదని పలువురు అంటున్నారు. తక్షణమే పోలీసులు గంజాయితోపాటు, డ్రగ్స్‌ వ్యాపారంపై నిఘా వేసి అసలు సూత్రధారులను పట్టుకొని, డ్రగ్స్‌ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.