పక్క దారి పట్టిన ఎల్ ఈడీ నిధులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పక్క దారి పట్టిన ఎల్ ఈడీ నిధులు

కర్నూలు, డిసెంబర్ 26, (way2newstv.com)
కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు గత ప్రభుత్వం ‘చంద్రక్రాంతి’ అనే పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఉన్న పౌరవీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ 2018 అక్టోబర్‌ 10న ఎమర్జెన్సీ ఎలక్ట్రికల్‌ సర్వీసు లిమిటెడ్‌ ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం చేసుకుంది.జిల్లాలోని మొత్తం 889 పంచాయతీల్లో పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులకు అప్పట్లో ఒత్తిళ్లు వచ్చాయి. ఇదే అదనుగా ఈఈఎస్‌ఎల్‌ నుంచి సబ్‌ కాంట్రాక్ట్‌ పొందిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఆదోని డివిజన్‌లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటును హైదరాబాదుకు చెందిన నరసింహా ఎలక్ట్రికల్స్‌ వారు, నంద్యాల, కర్నూలు డివిజన్‌లలో మస్తాన్‌రెడ్డి ఏజెన్సీ వారు చేపట్టారు. 
పక్క దారి పట్టిన ఎల్ ఈడీ నిధులు

ఆదోని డివిజన్‌లోని ఎమ్మిగనూరు రూరల్‌ మండలంలో 3,772, హొళగుంద 2,869, నందవరం 3,911, ఆదోని రూరల్‌  5,942, హాలహర్వి 2,629, కోసిగి 3,446, పెద్దకడబూరు 2,732, పత్తికొండ 4,651, మంత్రాలయం 3,462, గోనెగండ్ల 4,242, చిప్పగిరి 1,622, ఆస్పరి 3,646, మద్దికెర 1,852, దేవనకొండ మండలంలోని పల్లెదొడ్డి, కుంకునూరు పంచాయతీల్లో 333 ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. కౌతాళం, తుగ్గలి, ఆలూరు మండలాల్లో పనులు మొదలు కాలేదు. అదేవిధంగా నంద్యాల, కర్నూలు డివిజన్‌లలోని పలు పంచాయతీల్లో పనులు చేపట్టారు. జిల్లా మొత్తమ్మీద ఈ ఏడాది ఏప్రిల్‌ ఆఖరు నాటికి 1,53,836 బల్బులు వేసినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు పొందారు.ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటులో భాగంగా ప్రతి పౌర విద్యుత్‌ స్తంభానికి కొత్తగా యాంకర్‌ క్లాంప్, బోల్టులు, వైరింగ్‌తో పనులు చేయాలి. ఇందుకు గాను ఒక్కొక్క దానికి రూ.600, ఫిట్టింగ్‌ చార్జీగా మరో రూ.100 కాంట్రాక్టుఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎల్‌ఈడీ బల్బులను ఒప్పందంలో భాగంగా ఈఈఎస్‌ఎల్‌ సంస్థ సరఫరా చేస్తోంది. అయితే.. ప్రతి పంచాయతీలో 100–150 స్తంభాలకు మాత్రమే కొత్త మెటీరియల్‌ అమర్చి, మిగతా వాటికి పాత మెటీరియల్‌తోనే పనికానిచ్చేశారు. గోనెగండ్ల మేజర్‌ పంచాయతీలో 800 ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. అందులో కేవలం 150 స్తంభాలకే కొత్త మెటీరియల్‌ అమర్చారు. మిగతా 650 బల్బులను పాత మెటీరియల్‌తోనే అమర్చినట్లు పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. కోసిగి మేజర్‌ పంచాయతీలో 1,150 ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. ఇందులో 350 బల్బులు మాత్రమే కొత్త మెటీరియల్‌తో బిగించారు. అయితే..అన్నింటినీ కొత్తవాటితోనే అమర్చినట్లు చూపి బిల్లులు పొందారు. ఇలా జిల్లా మొత్తమ్మీద 70 శాతం అక్రమ బిల్లులే పొందినట్లు తెలుస్తోంది. రూ.6 కోట్లకుపైగా అక్రమాలు జరిగాయని చర్చ సాగుతోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపడితే అక్రమాల డొంక కదులుతుందని ఆదోని డివిజన్‌కు చెందిన ఓ ప్రధాన అధికారి పేర్కొనడం గమనార్హం.  అయితే.. ఈ కుంభకోణంలో పంచాయతీ కార్యదర్శుల అమాయకత్వాన్ని, అవసరాలను సొమ్ము చేసుకుంటూ కాంట్రాక్టర్లు వారి నుంచి రికార్డులపై సంతకాలు కూడా చేయించుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.