విశాఖ రాజు.. జై కోట్టేస్తారా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖ రాజు.. జై కోట్టేస్తారా

విశాఖపట్టణం, డిసెంబర్ 9 (way2newstv.com)
విశాఖ జిల్లా బీజేపీ రాజుగారు మళ్ళీ జగన్ కి జై కొట్టారు. అంటే ఆయన పార్టీ మారుతారని కాదు, జగన్ విధానాలకు ఈ మాజీ ఎమ్మెల్యే గారు ఫిదా అయిపోతున్నారంతే. దాన్ని ఎక్కడా దాచుకోకుండా తెగ మెచ్చుకుంటున్నారు. తాజాగా విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి జగన్ సర్కార్ బూజు దులపడం పట్ల రాజావారు సంతోషించారు. ఇది పుష్కర కాలం నాటి మాట. అనాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ తో పాటు విశాఖ నగరానికి కూడా మెట్రో రైల్ కావాలని కోరి మరీ ఎంపిక చేశారు. హైదరాబాద్ ముందుగా మొదలైంది. విశాఖ మెట్రో రైలు అయితే ప్రతిపాదనల స్థాయిలో ఆగింది. ఇక వైఎస్సార్ మరణం తరువాత వచ్చిన ప్రభుత్వాలు సైతం మెట్రో రైలు విషయంలో శ్రధ్ధ పెట్టలేదు. 
విశాఖ రాజు.. జై కోట్టేస్తారా

నవ్యాంధ్ర తొలి సీఎం చంద్రబాబు కూడా విజయవాడ రాజధాని కాబట్టి అక్కడ మెట్రో రైలు ఉండాలని కొత్త ప్రతిపాదనలు తయారు చేయించారు. దాంతో మెట్రో రైలు ప్రతిపాదన అలా మూలకు పోయింది.విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడం పట్ల బీజేపీ రాజు గారు భేష్ అంటున్నారు. ఇది నిజంగా లక్షలాది ప్రజల కోరిక. ఆ ప్రజలకు మెట్రో రైలు వల్ల కష్టాలు తీరుతాయని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. ఈ విషయంలో సరైన నిర్ణయం వైసీపీ సర్కార్ తీసుకుందని ఆయన అన్నారు. విశాఖ అభివృధ్ధి కి మెట్రో రైలు ఓ విధంగా అతి పెద్ద ఆలంబనగా కూడా పేర్కొన్నారు. రాజు గారు గతంలో కూడా ఆంగ్ల మాధ్యమం విషయంలో కూడా జగన్ సర్కార్ కి మద్దతు ప్రకటించారు. పేద పిల్లలు చదువుకునే సర్కార్ బడులలో ఆంగ్ల బోధన వల్ల వారికి ఎంతో ఉపయోగం ఉంటుందని, ఉన్నత చదువులకు, పెద్ద ఉద్యోగాలకు అవకాశం ఉంటుందనికూడా ఆయన కితాబు ఇచ్చారు.బీజేపీ విషయానకి వస్తే జగన్ చేపడుతున్న ఒక్క కార్యక్రమాన్ని ఇంతవరకూ మెచ్చుకున్న దాఖలాలు లేవు. బీజేపీ నాయకులు తెల్లారిలేస్తే చాలు జగన్ మీద విమర్శలతో దాడి చేస్తున్నారు. నేపధ్యంలో వారికి భిన్నంగా తరచూ విష్ణుకుమార్ రాజు వైసీపీని, జగన్ ని పొగడడం పట్ల పార్టీ లోపలా బయటా కూడా చర్చ సాగుతోంది. రాజు గారు గీత దాటుతారా అని కూడా మాట వినిపిస్తోంది. అయితే ఆయన అనుచరులు మాత్రం ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నైజం రాజు గారిదని, విశాఖ ప్రగతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం జగన్ సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నపుడు సానుకూలంగా స్పందించడంతో తప్పులేదని అంటున్నారు. అయితే రాజు గారి మాటల వెనక మతలబు ఏదో ఉండి ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి పొగడ్తల‌తోనే రాజు గారు సరిపెడుతున్నారు, ముందు ముందు కమలానికి కలవరం కలిగిస్తారా అన్నది చూడాలి మరి.