గుంటూరు, డిసెంబర్ 21, (way2newstv.com)
త్యాగరాజులకు వైసీపీలో మంచి గుర్తింపు ఇచ్చేందుకు పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ కోసం ఎన్నికల సమయంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా తమ టికెట్లను సైతం త్యాగం చేసి, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు పదవులు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో బాగంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి తప్పుకొని కిలారు రోశయ్యకు లైన్ క్లియర్ చేసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణకు జగన్ త్వరలోనే పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వైసీపీ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.రావి వెంకటరమణకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది.
త్యాగయ్యలకు జగన్ పెద్ద పీట
2004 ఎన్నికల్లో ఆయన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న మాకినేనిని ఓడించి రికార్డు సృష్టించారు. అప్పట్లో అదో సంచలనమైంది. 2009లో ప్రత్తిపాడు ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఆయనకు సీటు రాలేదు. అలాంటి నాయకుడు తర్వాత వైఎస్ మరణం, తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఆయన తన రాజకీయాలను వైసీపీతో స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే 2014లో పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఈ ఏడాది ఎన్నికలకు ముందు వరకు పొన్నూరు ఇన్‌చార్జ్‌గానే పార్టీ పటిష్టత కోసం పనిచేశారు.ఎన్నికలకు 20 రోజుల ముందు అనూహ్యంగా పరిణామాలు మారిపోయాయి. అప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు గుంటూరు లోక్‌సభ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కిలారు రోశయ్యను పొన్నూరు కు పంపాల్సి వచ్చింది. ఇక్కడ రోశయ్య మామ అయిన వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రాంగం కూడా పని చేసింది. దీంతో ఎన్నికలకు దాదాపు నెల రోజు ల ముందు వరకు కూడా ఇంచార్జ్‌గా ఉన్న రావి వెంకట రమణ తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, పార్టీ కోసం ఆయన భేషజాలకు పోకుండా కూడా పనిచేశారు. రావి వెంకటరమణ చేసిన త్యాగానికి ప్రతిగా జగన్ ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోన్న చర్చల ప్రకారం రావి వెంకటరమణకు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ప్రత్తిపాడు, పొన్నూరు రెండు నియోజకవర్గాల్లో పట్టున్న నేతగా ఆయన ఎక్కడ జడ్పీటీసీగా పోటీ చేసినా సులువుగానే విజయం సాధిస్తారు. జిల్లా వైసీపీ నేతలందరితోనూ సఖ్యతతో ఉండే రావి వెంకట రమణకు మెజార్టీ ప్రజాప్రతినిధులు కూడా సపోర్ట్‌గా ఉంటున్నారు. జడ్పీ చైర్మన్ ఓసీలకు రిజర్వ్ కాని పక్షంలో మరో నామినేటెడ్ పదవి అయినా రావి వెంకట రమణకు దక్కే ఛాన్సులు ఉన్నాయి.