వైసిపి లో అగ్గి రాజేసిన మూడు రాజధానుల అంశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసిపి లో అగ్గి రాజేసిన మూడు రాజధానుల అంశం

విజయవాడ డిసెంబర్ 26 (way2newstv.com):
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడు రాజధానుల అంశంపై రచ్చ ప్రారంభమైంది.    "నాకు ఒక కన్ను పోయినా ఫర్వాలేదు గానీ ఎదుటివాడికి రెండు కళ్లూ పోవాలి'' అన్న తీరుగా సాగుతోంది ప్రస్తుతం ఏపీలో రాజకీయం!  ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతల నుంచి ఎమ్మెల్యేలకు, మంత్రులకు సెగ మొదలైంది. అయితే అధినేతకు భయపడి వారెవరూ నోరు మెదపటం లేదు. గళం వినిపించిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూడా తన మాటలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ అవతరించింది. నిన్నమొన్నటి వరకూ ఏపీ రాజధానిగా వర్థిల్లిన అమరావతిపై ప్రస్తుత సర్కారు కత్తిగట్టింది. ఫలితంగా మూడు రాజధానులున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రూపు దాల్చనుంది. ఈ అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవటమే తరువాయి! డిసెంబర్ 27వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ ముచ్చట కూడా తీరిపోవచ్చు. 
వైసిపి లో అగ్గి రాజేసిన మూడు రాజధానుల అంశం

ముఖ్యమంత్రి జగన్ నోటినుంచి వచ్చిన మాటలనే తూ.చా. తప్పకుండా జీఎన్ రావు కమిటీ కూడా వల్లించింది!  దిలా ఉంటే, మూడు రాజధానుల నిర్ణయంపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో అంతర్గతంగా గుబులు రేగుతోంది. కోస్తాలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లోను, రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోనూ పార్టీలో అసంతృప్తి రాజుకుంది. అధినేత జగన్‌కు భయపడి ఎమ్మెల్యేలు నోరు మెదపకపోయినప్పటికీ, ద్వితీయశ్రేణి నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రజాప్రతినిధులకు వివరిస్తున్నారు. "మన ప్రాంతంలో ఉన్న రాజధానిని వేరే చోటకు మార్చడం ఏంటి?'' అని వారు నిలదీస్తున్నారు.   ఈ మధ్య వరకూ ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే! సచివాలయం సహా ఇతర శాఖాధిపతుల కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూల్ జిల్లాలకు చెందినవారు సచివాలయం లేదా శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏదైనా పని ఉండి అమరావతికి వెళ్లాలంటేనే దూరాభారమని భావించేవారు. అలాంటిది.. ఇప్పుడు విశాఖపట్టణానికి రాజధాని తరలిస్తే.. వారు ఎలా వెళ్తారనేది చిక్కుప్రశ్నగా మారింది. అలా వెళ్లాలంటే ఒక్కొక్కరికీ ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకూ ఖర్చవుతుందని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు.   కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుచేస్తామని చెబుతున్నప్పటికీ, కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం "ఇక్కడ హైకోర్టు నెలకొల్పితే ఉపయోగం ఏంటి?'' అని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసారావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మీడియ ప్రతినిధులతో మాట్లాడుతూ "పాలనా రాజధాని, శాసనవ్యవస్థ ఒకేచోట ఉండాలనీ, అప్పుడే పరిపాలన సజావుగా సాగుతుందనీ'' వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కూడా చెబుతానని ఆయన స్పష్టంచేశారు. అయితే.. ఆ మరుసటిరోజు ఉదయానికే హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ వెళ్లినట్టుంది. మధ్యాహ్నానికల్లా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తాను అన్న మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. పార్టీ అధినేత జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.  కొంతమంది వైసీపీ ఎంపీలు కూడా మూడు రాజధానుల నిర్ణయంపై అంతర్గతంగా పెదవి విరుస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన, అమరావతి నుంచి పాలనా రాజధానిని విశాఖపట్టణానికి తరలిస్తామంటూ జగన్‌ చేసిన ప్రకటనపై కోస్తాలో ఎటువంటి వ్యతిరేకత రాలేదని వైసీపీ నేతలు బయటకి చెబుతున్నప్పటికీ, అసలు నిజం మాత్రం వేరే ఉందట! కోస్తాంధ్ర ప్రజలు తమ మనసులోని భావాన్ని అంత తేలికగా బయటపెట్టరనీ, సరైన సమయంలో కీలెరిగి వాత పెడతారనీ కొందరు విశ్లేషిస్తున్నారు. కోస్తాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు క్రమంగా రాజకీయాలపై ప్రసరించి ప్రభావం చూపుతున్నాయనీ, ఆ ప్రభావం అన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తోందని కూడా వైసీపీలోని కొంతమంది నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగా వారిలో అంతర్గతంగా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ.. బయటికి మాత్రం బింకం ప్రదర్శిస్తున్నారట. అంతర్గతంగా సాగే అసంతృప్తి, అవమానభారం, ఆగ్రహం ఏదో ఒకరోజు బహిర్గతం కావడం ఖాయమనీ, ఇదేదో రాయలసీమ నుంచే ప్రారంభమవుతుందనీ వైసీపీకి చెందిన ఓ కీలకనేత వ్యాఖ్యానించడం గమనార్హం. రాజధాని రైతులను టార్గెట్ చేసుకుని కొంతమంది మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు కూడా కోస్తాలోని వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం రుచించడం లేదు. ఈ అంశాన్ని త్వరలోనే అధినేత దృష్టికి తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి మూడు రాజధానుల అంశం వైసీపీలో సెగ రాజేసిన మాట వాస్తవం. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి!