జగన్ దమ్మున్న నాయకుడు : జేసీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ దమ్మున్న నాయకుడు : జేసీ

విజయవాడ, డిసెంబర్ 11  (way2newstv.com)
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్‌రెడ్డి చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు అంటూ కితాబిచ్చారు. ఆయన చేయాలనుకున్న పనిని ధైర్యంగా చేస్తారని.. ఆరోగ్యశ్రీపై జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ అన్నారు. జగన్ కనిపిస్తే అభినందిస్తానని.. ఈ విషయంపై చంద్రబాబు ఏమనుకున్నా ఫర్వాలేదు అన్నారు. జగన్ ఆరు నెలల పాలన బావుందన్నారు.జగన్‌ను పొగడటం మాత్రమే కాదు.. చురకలు కూడా అంటించారు. ఈ ప్రభుత్వానికి రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం అని పేరు పెట్టాలన్నారు. 
జగన్ దమ్మున్న నాయకుడు : జేసీ

జగన్ హయాంలో ఆయన తాత రాజారెడ్డి పాలన సాగుతోందన్నారు. జగన్ నామినేటేడ్ పోస్టుల్లో రెడ్లకు ఎక్కువ ఇచ్చారని.. అందుకు అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జగన్ బాగా మాట్లాడారని కితాబిచ్చారు.జేసీ దివాకర్‌రెడ్డి గతంలో కూడా జగన్ పాలన బావుందని.. నూటికి నూరు మార్కులు వేస్తానన్నారు.. తర్వాత జగన్‌ను మళ్లీ టార్గెట్ చేశారు. ఇటీవల తన ట్రావెల్స్ బస్సులు విషయంలో మొన్నటి వరకు జగన్‌పై ఒంటి కాలుపై లేచిన జేసీ ఉన్నట్టుండి పొగడ్తలు కురిపించడం.. అందులోనూ చంద్రబాబు ఏమనుకున్నా ఫర్వాలేదనడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు జేసీ ఎప్పుడూ జగన్ 'మావాడే, మావాడే' అంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే గట్స్ ఉన్న నాయకుడు అంటూ ప్రశంసించారు.గత నెలలో జేసీకి సంబంధించిన ట్రావెల్స్ బస్సుల్ని ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. పర్మిట్లు సరిగా లేవని, టికెట్ల రేట్ల విషయంలో నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేశారు. ఈ వ్యవహారంలో జగన్ సర్కార్‌ను దివాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. తనను వైఎస్సార్‌సీపీలో చేరమని ఒత్తిడి పెరుగుతోందని.. తాను మాత్రం చేరనని తేల్చి చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఉన్నట్టుండి జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది.