గుంటూరు, డిసెంబర్ 9, (way2newstv.com)
ప్రత్తిపాటి పుల్లారావు. ఒకప్పుడు హడావిడి అంతా ఆయనదే. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన చేతుల మీదుగానే జరిగేది. జిల్లా అధ్యక్షుడు ఒకప్పుడు పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రి అయ్యారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రత్తిపాటి పుల్లారావు అనే స్థాయికి తీసుకువచ్చారు. చంద్రబాబు, నారా లోకేష్ లకు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందారు. అలాంటి ప్రత్తిపాటి కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు కొంతకాలం పార్టీలో యాక్టివ్ గానే కన్పించారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ సమీక్షలు కూడా నిర్వహించారు. టీడీపీ నిర్వహించిన చలో ఆత్మకూరు కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ప్రత్తిపాటి
అయితే గత రెండు, మూడు నెలల నుంచి నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు పూర్తిగా పార్టీకి దూరమయ్యా రంటున్నారు.ప్రత్తిపాటి పుల్లారావు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. రాజధాని భూముల వ్యవహారం, హ్యాయ్ లాండ్ భూముల విషయంలో ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధం ఉందని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ తరచూ ఆరోపించేది. ఇప్పుడు వైసీపీ సర్కార్ రాజధాని భూముల కొనుగోళ్లపై సీఐడీ ద్వారా ఆరా తీస్తుంది. అంతేకాకుండా ప్రత్తిపాటి పుల్లారావు భార్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన డీల్స్ మీద కూడా విచారణ జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతున్నా ఆయన ఖండించలేదు. కొంతకాలం క్రితం నారా లోకేష్ పొన్నూరు పర్యటనకు వచ్చినా దూరంగా ఉంటున్నారు. వల్లభనేనివంశీ, దేవినేని అవినాష్ వంటి వారు పార్టీ మారినా ఆయన తన గొంతు విప్పలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీడీపీకి మద్దతుగా ఆయన పెదవి విప్పడం లేదు. అయితే ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం పార్టీని వీడేందుకు వేచి చూసినట్లు కన్పిస్తోంది.