భాగ్యనగర్ భగవత్ భేరితో..మోదీకి డబుల్ పవర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భాగ్యనగర్ భగవత్ భేరితో..మోదీకి డబుల్ పవర్

హైదరాబాద్ డిసెంబర్ 26 (way2newstv.com)
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సైద్ధాంతిక కర్తగా పేరున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భాగ్యనగర్ భగవత్ భేరితో..మోదీకి డబుల్ పవర్ వచ్చిందని విశ్లేషణలు సాగుతున్నాయి. చీఫ్ మోహన్ భగవత్ మన భాగ్యనగరి వేదికగా సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆరెస్సెస్ లక్ష్యం ప్రపంచ విజయమేనంటూ భగవత్ చేసిన వ్యాఖ్యలు...సర్వత్రా చర్చనీయాంశమైనాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏబీ) జాతీయ పౌర జాబితా( ఎన్నార్సీ)ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్న వేళ... ఆరెస్సెస్ చీఫ్ భగవత్... తమ లక్ష్యం ప్రపంచ జయమంటూ చేసిన వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయని చెప్పక తప్పదు. 
భాగ్యనగర్ భగవత్ భేరితో..మోదీకి డబుల్ పవర్

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేసిన భగవత్... ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులుగా చిత్రీకరించే కోణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఆరెస్సస్ విజయ సంకల్ప సభకు భగవత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్టేడియం నిండా కరసేవకులతో నిండిపోగా... అశేష జన సందోహాన్ని చూసిన భగవత్ ఓ రేంజిలో ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు సరికొత్త సవాళ్లను అధిగమిస్తారని... పరోక్షంగా మోదీ సంకల్పం సిద్ధిస్తుందన్న దిశగా ఆసక్తికర కామెంట్ చేశారు. తాను అనుకున్న పనిని దిగ్విజయంగా ముగించడంలో మోదీకి తిరుగులేదన్న భావన వ్యక్తమయ్యేలా భగవత్ సంచలన కామెంట్లు చేశారు. ఇప్పుడు చట్టంగా మారిపోయిన పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ సర్కారు పక్కాగానే అమలు చేస్తుందని ఇందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మోదీ సర్కారు విజయం సాధిస్తారన్న స్ఫురణ వచ్చేలా భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.అదే సమయంలో మోదీ సర్కారు ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో మిన్నంటిన నిరసనలను కూడా భగవత్ తనదైన శైలిలో ఖండించారు. దేశంలో కొందరు ఏవేవో ఊహించుకుని విధ్వేషాలను రెచ్చగొట్టి దు:ఖాన్ని కొని తెచ్చుకుంటున్నారని అలాంటి వారు ప్రపంచాన్ని కూడా దు:ఖంతో నిపేయాలని చూస్తున్నారని కూడా భగవత్ తనదైన శైలి ఘాటు కామెంట్లు చేశారు. నీతి - న్యాయం - ధర్మం వంటి విలువలపై సానుకూల ఆలోచనా దృక్పథం లేకపోవడం సమాజానికి మంచిది కాదని కూడా భగవత్ కాస్తంత లోతైన భావన కలిగిన వ్యాఖ్యలు చేశారు. స్వార్థం కోసం కొంతమంది ఇతరులను భయపెట్టి పైకి వస్తారని ఇలాంటి వారు దేశానికి చాలా ప్రమాదకరమని కూడా భగవత్ వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధికి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తూ ఊరుకుంటే... ఏ పనులు కావని సమాజంలో పరివర్తన వచ్చినప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని కూడా భగవత్ చెప్పుకొచ్చారు. మొత్తంగా తనదైన శైలి వ్యాఖ్యలతో మోదీకి డబుల్ శక్తిని ఇచ్చేసారు.