బెజవాడ ఎంపీ కేశినేని దారెటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెజవాడ ఎంపీ కేశినేని దారెటు

విజయవాడ, డిసెంబర్ 13, (way2newstv.com)
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీ లైన్ ను థిక్కరిస్తున్నారా? ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం లేదా? అంటే అవుననే అంటున్నారు. కేశినేని నాని రూటు సపరేటుగా ఉంటుంది. ఆయనకు నచ్చిన విషయాన్ని మాత్రమే అనుసరిస్తారు. నచ్చకపోతే దాని జోలికి కూడా పోరు. తాజాగా పౌరసత్వ బిల్లు విషయంలో కేశినేని నాని పార్టీ ఆదేశాలను థిక్కరించారు. పౌరసత్వ సవరణ బిల్లును తెలుగుదేశం పార్టీ సమర్థించింది. దానికి అనుకూలంగా టీడీపీ పార్లమెంటు సభ్యులు ఓటు వేయాలని నిర్ణయించింది.అయితే కేశినేని నాని మాత్రం ఈ పౌరసత్వ బిల్లు ఓటింగ్ ను వ్యతిరేకించారు. లోక్ సభలో టీడీపీకి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ లు టీడీపీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఓటింగ్ లో పాల్గొనగా, కేశినేని నాని మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించారు. కేశినేని నాని పౌరసత్వ సవరణ బిల్లును సమర్థించలేదు. 
బెజవాడ ఎంపీ కేశినేని దారెటు

దీనిపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. కేశినేని నాని ఎప్పుడూ పార్టీ నిర్ణయాన్ని అమలు పర్చకపోవడంపై పార్టీలోనే విమర్శలు విన్పిస్తున్నాయి.విజయవాడ పార్లమెంటులో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు అనేక నియోజకవర్గాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని పార్టీలైన్ ను థిక్కరించారంటున్నారు. గతంలో కూడా కేశినేని నాని ఇలాగే వ్యవహరించారు. ఎంపీగా గెలిచిన వెంటనే కేశినేని నాని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి అప్పట్లో వివాదానికి కారణమయ్యారు. అయితే ఇది సద్దుమణిగేలోగా ఆయనకు చెందిన పార్టీ కార్యాలయాన్ని కూడా తరలించడాన్ని కేశినేని నాని సహించలేెకపోయారు.అయితే కేశినేని నానిపై ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఉన్నదే ముగ్గురు ఎంపీలు. అందులో ఒకరిపై చర్య తీసుకోలేని పరిస్థితి చంద్రబాబుది. ఇది పసిగట్టే కేశినేని నాని పార్టీ నిర్ణయాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదంటున్నారు. కేశినేని నాని పార్టీ లైన్ ను థిక్కరించిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి సీనియర్ నేతలు తీసుకెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. మొత్తం మీద కేశినేని నాని మాత్రం తాను అనుకున్నదే చేస్తారు తప్పించి పార్టీ గీర్టీ జాన్తానై అంటున్నారట.