1000 అడుగులు పడితే కాని... కనిపించని నీటీ జాడ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

1000 అడుగులు పడితే కాని... కనిపించని నీటీ జాడ

గుంటూరు, జనవరి 3, (way2newstv.com)
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వించి భూగర్భ జలాలను పైకి తెచ్చామని, చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులు 1000–1200 అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడటం లేదు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా.. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి, నూజెండ్ల, శావల్యాపురం, వినుకొండ, ఈపూరు మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలపాలై అప్పులపాలవుతున్నారు. గుంటూరు జిల్లాలో సాగర్‌ చివరి ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి సైతం దుర్భరంగానే ఉంది. 
1000 అడుగులు పడితే కాని... కనిపించని నీటీ జాడ

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదగొట్టిపాడు, నడింపాలెం, పాతమల్లాయపాలెం, కోయవారిపాలెం రైతులు ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నారు. కృష్ణా నది నిండా నీళ్లున్నా సాగుకు నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమేనని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి దుర్భిక్షం ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామ రైతులు తమ పొలాల్లో ఉన్న బోర్లు ఎండిపోవడంతో ఈ ఏడాది మరో 300 వరకూ కొత్త బోర్లను వేశారు. వీటిలో 5 శాతం బోర్లలో కూడా నీరుపడలేదు. కొందరు తమ పొలాల్లో 5–10 వరకూ బోర్లు వేసినా నిరాశే ఎదురైంది. దీంతో రైతులు పంటలు ఎండిపోయి అప్పులపాలై అందినకాడికి పొలాలను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. కండ్లకుంట, గుండ్లపాడు, ఉప్పలపాడు, బోదలవీడు, శిరిగిరిపాడు, వెల్దుర్తి వంటి గ్రామాల్లో సైతం వందలాది మంది రైతులు 1000–1200 అడుగుల మేర బోర్లు వేసినా చుక్క నీరూ పడకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఒక్క వెల్దుర్తి మండలంలోనే బోర్లకు సుమారు రూ.20 కోట్ల వరకూ రైతులు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. వెల్దుర్తి మండలంలో 12 వేల హెక్టార్లలో పత్తి, 4 వేల హెక్టార్లలో మిర్చి, 500 ఎకరాల్లో కంది పంటలను రైతులు సాగు చేశారు. నీరందక పంటలు ఎండిపోవడంతో రూ.200 కోట్ల మేర నష్టపోయారని అంచనా. ఒక్క మండలంలోనే ఇంత నష్టం వాటిల్లితే పల్నాడు ప్రాంతంలోని మిగతా మండలాల్లో సంభవించిన నష్టం వేల కోట్లలో ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.వోల్టా కమిటీలను ఏర్పాటు చేసి వోల్టా చట్టంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుండటం వల్లే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ చట్టం ప్రకారం.. రైతు బోరు వేయాలనుకుంటే ముందుగా సంబంధిత మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవడంతోపాటు డీడీ చెల్లించి భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేయించాలి. రెండు బోరు బావుల మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలి. అలా ఉందా? లేదా? అనేది తహసీల్దార్‌ నిర్ధారణ చేసుకున్నాక క్షేత్ర స్థాయి పరిశీలన కోసం జిల్లా భూగర్భ జలశాఖకు రిఫర్‌ చేయాలి. జియోహైడ్రాలజిస్ట్‌ సదరు భూమిలో నీటి లభ్యతను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తెలుసుకుని.. నీటి లభ్యత ఉంటే బోరు బావి తవ్వుకోవడానికి అనుమతి ఇస్తారు. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ ఎక్కడా అమలు కాకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా దగ్గర దగ్గర బోర్లు వేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు