హైద్రాబాద్, జనవరి 4, (way2newstv.com)
కొలువుల భర్తీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థమవుతున్నది. చివరి నోటిఫికేషన్ ములుగు అటవీ కాలేజీలో 24 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2018, సెప్టెంబర్ 10న విడుదలైంది. అంటే 16 నెలల నుంచి టిఎస్‌పిఎస్సి నుంచి నోటిఫికేషన్ జారీ కాలేదు. అయితే టిఎస్‌పిఎస్సి ఏర్పటి ఐదేళ్లు అవుతున్నది. ఈ ఐదేళ్లలో 36,602 పోస్టుల భర్తీకి 101 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 28,893 నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది టీఆర్టీ, గ్రూప్-2 నియామకాలకే టిఎస్‌పిఎస్సి పరిమితమైంది.
16 నెలల నుంచి టీపీపీసీ నుంచి నోటిఫికేషన్..
వాటితోపాటు డిపార్ట్‌మెంటల్ టెస్టులు నిర్వహించింది. ఇంకోవైపు కొలువులను భర్తీ చేయకపోయినా టీఆర్‌ఎస్ ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి అమలవుతుందని అందరూ ఆశించారు. ఒకవైపు కొలువులు రాకపాయే ఇంకోవైపు నిరుద్యోగ భృతి అమలు కాకపాయే. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అసలు నిరుద్యోగులను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి.ఇదిలావుంటే కొలువులు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగుల ఓట్లు పొందడం కోసం నిరుద్యోగ భృతి ఇస్తామని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే 2019-20 ఓటాన్ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయించారు. అయితే రెండోసారి అధికారం చేపట్టి ఏడాది దాటినా...ఈ పథకం అమలు కోసం విధివిధానాల ఇంత వరకూ ప్రకటించలేదు. ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇప్పటికే ఎంప్లారుమెంట్ ఎక్స్చేంజీల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. టిఎస్‌పిఎస్పి వన్ టైం రిజిస్ట్రేషన్ లో 29 లక్షల మంది వరకు పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఎంత మంది నిరుద్యోగులు అర్హులు, ఏ ప్రాతిపదికన నిరుద్యోగ భృతి అమలవుతుంది అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.నిరుద్యోగులు కోరుకున్న ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రభుత్వం అనుకున్న పనులనే చేస్తున్నది. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చినా అమలు చేయడం లేదు. లక్ష పోస్టులైనా భర్తీ అవుతాయని ఆశించారు. ఉద్యోగుల విరమణ, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడడంతో కొత్త ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. అవేవీ రాలేదు. నోటిఫికేషన్లు రాకపోవడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో విద్యార్ధులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.