ఖమ్మం, జనవరి 28, (way2newstv.com)
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక పెద్దలు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తేదీలను ఖరారు చేశారు. దేవస్థానం వైదిక కమిటీ అనేక సమాలోచనలు చేసి బ్రహ్మ ముహూర్తాన్ని నిర్ణయించింది. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న శ్రీరామనవమిని నిర్వహించనున్నారు. మరుసటి రోజు 3న శ్రీరామ మహా పట్ట్భాషేకం జరుగుతుందని తెలిపారు. స్వస్తిశ్రీ చాంద్రమాన ‘శార్వరి’ నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి మార్చి 25 నుంచి చైత్రశుద్ధ పూర్ణిమ ఏప్రిల్ 8వరకు భద్రాచలం క్షేత్రంలో వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు.
మార్చి 24నే రామయ్య పెళ్లికొడుకు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది రోజు అంటే మార్చి 24న రామయ్యను పెళ్లికొడుకును చేయనున్నారు. అదేరోజు పంచాంగ శ్రవణం నిర్వహించి తిరువీధి సేవలు ప్రారంభిస్తారు. ఏప్రిల్ 29న స్వామికి ఉత్సవాంగ స్నపనం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 30న భద్రకమండల లేఖనం, గరుడాధివాసం, 31న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, దేవతాహ్వానం, ఏప్రిల్ 1న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాద్రి దేవదేవుడి కల్యాణ మహోత్సవం నిర్వహించడానికి నిర్ణయించారు. ఏప్రిల్ 3న మహా పట్ట్భాషేకం జరపతలపెట్టారు. కాగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాచలం దేవస్థానంలో మార్చి 25నుంచి ఏప్రిల్ 8వరకు నిత్యకల్యాణాలను రద్దుచేసినట్లు ఆలయ ఈఓ నర్సింహులు తెలిపారు. మార్చి 29నుంచి ఏప్రిల్ 8వరకు దర్బారు సేవలు, ఏప్రిల్ 15వరకు పవళింపు సేవలు, సంధ్యాహారతి, వెండిరథ సేవలు ఉండవని ఆయన వివరించారు