విజయవాడ, జనవరి 13, (way2newstv.com)
జగన్ ఊపు చూస్తే మామూలుగా లేదుగా. ఆయన షాకింగ్ డెసిషన్స్ తో విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒకటి తరువాత ఒకటిగా నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించడంతో ఎక్కడ నిలబడాలి. దేన్ని అడ్డుకోవాలి అన్న డౌట్ తో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీయే అయోమయంలో పడిపోతోంది. మూడు రాజధానుల ప్రకటనతో చలికాలంలో వేడి రాజేసిన జగన్ ఇపుడు మరో కొత్త నిర్ణయానికి అదే స్పీడు తో రెడీ అయిపోతున్నారు. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను కూడా జగన్ తొందరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఆ రచ్చ వేరేలా ఉంటుందని అంటున్నారు.ఇపుడు ఉన్న ఎంపీ సీట్లనే కొత్త జిల్లాలుగా చేయాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది. అంటే పదమూడు జిల్లాలు కాస్తా పాతిక అవుతాయన్న మాట.
25 జిల్లాలకు సిద్ధమౌతున్న జగన్
ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మార్చడానికి జగన్ సర్కార్ రంగం సిధ్ధం చేస్తోంది. ఉత్తరాంధ్రలో ఆ లెక్కన మూడు జిల్లాలు కాస్తా అయిదు జిల్లాలు అవుతాయి. ఈ విధానం వల్ల పాలన మరింతగా జనాలకు చేరువగా ఉంటుందని జగన్ సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో రాజకీయంగా కూడా ప్రతిపక్షానికి చెక్ పెడుతూ, వైసీపీకి వరకూ దీన్ని అనువుగా చేసుకోవడానికి ప్రయత్నాలు ఎటూ ఉంటాయి.జిల్లాలను చిన్నవిగా చేయడం పాలనాపరంగా ఎంత బాగుంటుందో కానీ రాజకీయంగా దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఎటూ అధికారంలో ఉండడంతో వారు కోరుకున్న విధంగా జిల్లాల విభజన జరుగుతుందని అంటున్నారు. తమకు పట్టున్న ప్రాంతాలను అటూ ఇటూ కలుపుకోవడం ద్వారా జిల్లాల మీద పూర్తి ఆధిపత్యం సాధించేందుకు, రాజకీయంగా మరింతగా బలపడేందుకు వైసీపీ సర్కార్ ఈ ప్రతిపాదన ముందుకు తెస్తోందని అంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీకి మళ్ళీ రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. కొత్త జిల్లాల విషయంలో కూడా పోరాటం చేయడానికి ఇప్పటి నుంచే ఆ పార్టీ శక్తిని కూడదీసుకోవాలేమో. ఇప్పటికే అమరావతి రాజధాని అంటూ అలసిపోతున్న టీడీపీకి కొత్త జిల్లాలతో తనదైన పొలిటికల్ పంచ్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు.జగన్ పాలనాపరమైన ఆలోచనలు కొత్త విప్లవంగానే చూడాలని అంటున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలను దేశంలో ఎక్కడా లేని విధంగా ఆవిష్కరించిన జగన్ ఇపుడు చిన్న జిల్లాల కాన్సెప్ట్ తో మరింతగా జనాలకు పాలనను చేరువ చేయాలనుకుంటున్నారు. అదే విధంగా ప్రతి రెండు, మూడు జిల్లాలను కలుపుతూ ఎక్కడికక్కడ ప్రాంతీయ కమిషరేట్లు ఏర్పాటు చేయడం, పాలనను పూర్తిగా వికేంద్రీకరణ చేయడం ద్వారా అన్ని చోట్లా సమానమైన అభివ్రుద్ధ్ధి కనిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. ఇక రాష్ట్ర సచివాలయానికి ఏ విధంగానూ రావాల్సిన అవసరం లేకుండా ప్రజలకు వారి ముంగిట్లోనే పాలనను తీసుకువస్తే రాజధానులకు రద్దీ కూడా తగ్గుతుందని భావిస్తున్నారుట. మొత్తానికి మూడు రాజధానుల ప్రకటనతో విపక్షానికి గుక్క తిప్పుకోనీయని జగన్ పాతిక జిల్లాల కాన్సెప్ట్, ప్రాంతీయ కమిషనరేట్లు వంటివి బయటకు తీస్తే మొత్తానికి మొత్తంగా విపక్షం ఏపీలో క్లీన్ బౌల్డ్ అవుతుందని వైసీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.