వరంగల్, జనవరి 23, (way2newstv.com)
దేవాదుల మూడో దశ రెండో ప్యాకేజీలో రూ.1,149 కోట్లతో 2004లో చేపట్టిన పనులు చివరిదశకు చేరాయి. భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు 25 కి.మీ. మేర మూడు వరసల పైప్‌లైన్ నిర్మించారు. రెండు మహా మోటార్లను చైనా నుంచి తెప్పించి బిగించారు. భీం ఘన్‌పూర్ పంప్‌హౌస్ నుంచి ఈ నెల 31న ట్రయల్‌రన్ చేపట్టనున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా వచ్చింది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పైప్‌లైన్‌వినియోగం లోకి వస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీరినట్లే. సుమారు 40 టీఎంసీల గోదావరి నీళ్లు వినియోగంలోకి వస్తాయి.దేవాదుల మూడో దశలో మొత్తం 8 ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టారు. మొదటి ప్యాకేజీలో గోదావరి ఇంటెక్‌వెల్ నుంచి భీంఘన్‌పూర్ వరకు మూడు వరసల పైప్‌లైన్, రెండో ప్యాకేజీలో భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు రూ.531 కోట్లతో సొరంగ నిర్మాణం చేపట్టాలని ముందుగా నిర్ణయించారు. టెండర్లు పూర్తయి వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది.
31న దేవాదుల ట్రయిల్ రన్
రూ.50 కోట్లకు పైగా నిధులు కూడా ఖర్చు చేశారు. అయితే భూ అంతర్భాగంలో జరుపుతున్న బాంబు పేలుళ్లతో రామప్ప టెంపుల్‌కు ప్రమాదం పొంచి ఉందని ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వచ్చాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో ప్యాకేజీ అలైన్‌మెంట్‌ను పైప్‌లైన్‌గా మార్చింది. 2017 ఫిబ్రవరి 10న అదనంగా రూ.618 కోట్ల అంచనా వ్యయాన్ని పెంచుతూ రూ.1,149 కోట్లతో మూడు వరసల పైప్‌లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు 25 కి.మీ. దూరం 100 మీటర్ల చిన్నచితక పనులు మినహా ప్రధాన పైప్‌లైన్ నిర్మాణం పూర్తయ్యింది. 3 మీటర్ల వ్యాసార్థంతో పైపులు వేశారు. భీం ఘన్‌పూర్‌వద్ద కి.మీ. దూరం అప్రోచ్‌చానల్ తవ్వారు. పంప్‌హౌజ్, ఫోర్‌బే నిర్మాణం కూడా పూర్తయ్యింది. రామప్ప చెరువు వద్ద అవుట్‌ఫాల్ నిర్మించారు.భీంఘన్‌పూర్ పంప్‌హౌజ్‌వద్ద 3 మోటార్లను బిగించాల్సి ఉంది. ఒక్కో మోటార్ 22 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. వీటిలో రెండు మోటార్లను చైనా నుంచి తెప్పించి బిగించారు. మిగిలిన ఒక మోటార్‌ను త్వరలోనే తెప్పించి అమర్చుతామని దేవాదుల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు మోటార్ల ద్వారా ట్రయల్‌రన్ నిర్వహిస్తామని అంటున్నారు. దేవాదుల పథకంలో మొత్తం మూడు దశల ద్వారా తొలుత 38 టీఎంసీల నీటిని వినియోగించాలని ప్రభుత్వం భావించింది. దీనిని ఇప్పుడు 60 టీఎంసీలకు పెంచింది. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తయ్యి భీంఘన్‌పూర్ వరకు నీళ్లు వస్తున్నాయి. మిగతా 7 ప్యాకేజీల పనులు పూర్తి కాకపోవడం వల్ల మూడో దశ మోటార్లను ఎక్కువగా ఉపయోగించడం లేదు. ఒకవేళ మోటార్లను ఆన్‌చేసినా భీంఘన్‌పూర్ చెరువు వరకు మాత్రమే తీసుకొచ్చి ఆ తర్వాత మొదటి, రెండో దశ మోటార్ల ద్వారానే ఎగువకు పంపింగ్‌చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రెండో ప్యాకేజీ పనులు కూడా పూర్తికావడంతో రామప్ప చెరువును పూర్తిగా నింపవచ్చు. రామప్ప నుంచి పాకాల వరకు కూడా పైప్‌లైన్ పనులు పూర్తయి ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఇప్పుడిక ఈ రెండు చెరువులతో పాటు సుమారు 40 టీఎంసీల నీళ్లను ఆయకట్టుకు అందించవచ్చు.