6న గొట్టిపాటి గూటికి వైసీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

6న గొట్టిపాటి గూటికి వైసీపీ

ఒంగోలు, జనవరి 9, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఆకర్షించే పనిని వైఎస్సార్ కాంగ్రెస్ ఆపలేదు. ఇప్పటికే ఇద్దరు శాసనసభ్యులను టీడీపీ నుంచి బయటకు పంపించి వేయగలిగారు. వారు వైసీపీలో చేరకపోయినప్పటికీ అనధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుల మాదిరిగానే చలామణి అవుతున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలిగిరిలు టీడీపీని వీడిన తర్వాత మిగిలిన వారిపై వైసీపీ దృష్టి పెట్టింది. అడుగడుగునా అడ్డంపడుతున్న చంద్రబాబును కట్టడి చేయడానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న వ్యూహంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే గొట్టిపాటి రవికుమార్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశాలున్నాయి. గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి పాతకాపు. 2014 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ వైసీీపీ పార్టీ తరుపున పోటీ చేసి అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీలో చేరారు. 
6న గొట్టిపాటి గూటికి వైసీపీ

2019 ఎన్నికల్లోనూ గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత కొంతకాలంగా గొట్టిపాటి రవికుమార్ పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్ ను బుజ్జగిస్తూ వస్తున్నారు.గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు జరిగాయి. చుట్టుపక్కల అనేక మందికి చెందిన గ్రానైట్ క్వారీలున్నప్పటికీ గొట్టి పాటి రవికుమార్ క్వారీలపైనే దాడులు జరపడంతో రాజకీయ దాడులేనని టీడీపీ భావించింది. ఈ దాడుల తర్వాత కూడా గొట్టిపాటి రవికుమార్ తాను పార్టీని వీడేది లేదంటూ ప్రకటించారు. శాసనసభ సమావేశాలకు పెద్దగా హాజరు కాకపోవడంతో ప్రశ్నించిన మీడియాకు తనకు వ్యక్తిగత పనులున్నాయని చెప్పారు.అయితే గొట్టిపాటి రవికుమార్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను గొట్టిపాటి రవికుమార్ కలవనున్నారని సమాచారం. అయితే గొట్టిపాటి రవికుమార్ కూడా వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ ల బాటలోనే పయనించనున్నారు. సీఎంను కలిసిన తర్వాత చంద్రబాబుపై విమర్శలు చేయడం, జగన్ ను ప్రశసించడం వంటివి ఎప్పటిలాగానే జరిగిపోతాయని చెబుతున్నారు. గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ఒక మంత్రితో చర్చలు జరిపారని చెబుతున్నారు. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా జగన్ ను కలసే వారిలో విన్పిస్తున్నాయి.