81 రూపాయిలకు చేరిన పెట్రోల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

81 రూపాయిలకు చేరిన పెట్రోల్

ముంబై, జనవరి 7  (way2newstv.com)
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై తాజాగా పెట్రోల్ పిడుగు పడింది. రోజువారీగా ధరలు పెంచుతున్న ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు వరుసగా పది రోజులకు పైగా ధరలను అమాంతం పెంచుతున్నాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను పది పైసలకు పెంచాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు పెరగడంతో రూ.75.35కి చేరుకున్నది. అలాగే డీజిల్ మరో 15 పైసలు అందుకొని రూ.68.25 పలికింది. గత పది రోజుల్లో పెట్రోల్ 67 పైసలు అధికమవగా, డీజిల్ ఏకంగా రూ.1.25 ఎగబాకింది. ఆర్థిక రాజధాని ముంబైలో అయితే లీటర్ పెట్రోల్ రూ.81 దిశగా పరుగులు పెడుతున్నది. గురువారంతో పోలిస్తే లీటర్ ధర 12 పైసలు అధికమై రూ.80.94 పలికింది. అలాగే కోల్‌కతాలో రూ. 77.94కి చేరుకోగా, చెన్నైలో రూ.78.28 పలికింది.
81 రూపాయిలకు చేరిన పెట్రోల్

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్, ఇతర పన్నుల ఆధారంగా ధరల పెంపు మరింత అధికంగా ఉండనున్నది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 8 పైసలు అధికమై రూ.80.12కి చేరుకోగా, డీజిల్ 14 పైసలు అందుకొని రూ.74.42కి చేరింది. గత వారం రోజుల్లో భాగ్యనగరంలో 65 పైసలు పెట్రోల్ అధికమవగా, డీజిల్ రూ.1.32 ఎగబాకింది. ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. 2019లో లీటర్ డీజిల్ ధర రూ.5.1 అధికమవగా, పెట్రోల్ రూ.6.3 ఎగబాకింది.అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కె ట్లో ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా రోజువారిగా ధరలను మారుస్తున్న ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు..వచ్చే కొన్ని రోజుల్లో మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాక్ విమానాశ్రయంలో ఇరాన్‌కు చెందిన కమాండర్‌ను అమెరికా భద్రత దళాలు మట్టుపెట్టడంతో బ్రెంట్ క్రూడాయిల్ ఒకేరోజు 4 శాతం ఎగబాకింది. దీంతో బ్యారెల్ ధర 69.16 డాలర్లకు చేరుకున్నది. సెప్టెంబర్ తర్వాత ఇంతటి స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి