భారత క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరం భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నో ఉత్కంఠమైన మలుపులతో దక్కిన గెలుపు అది. అలాంటి ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై `83` సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు.
`83` ఫస్ట్ లుక్ విడుదల
`83` చిత్రాన్నిఏప్రిల్ 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో `83` చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చెన్నై సత్యం థియేటర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమాని మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ క్రికెటర్ శ్రీకాంత్, యూనివర్సల్ హీరో కమల్‌హాసన్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, డైరెక్టర్ కబీర్ సింగ్, హీరో జీవా, వై నాట్ స్టూడియోస్ శశికాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరో రణ్వీర్ సింగ్ సత్యం థియేటర్ ఆవరణలో 40 అడుగుల బ్యానర్‌పై సినిమా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రణ్వీర్ కాసేపు హోస్ట్‌గా వ్యవహరించి తనతో పాటు ఇండియన్ టీమ్ సభ్యులుగా నటించిన ఇతర నటులను వేదికపైకి ఆహ్వానించడమే కాదు.. స్టేజ్‌పై కూడా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.