మౌన ముద్రలోకి హరిబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మౌన ముద్రలోకి హరిబాబు

విశాఖపట్టణం, జనవరి 4, (way2newstv.com)
ఆయన రాజకీయాల్లో తలపండిన వారు. దశాబ్దాల కాలంగా బీజేపీలో పనిచేసిన వారు. ఇంకా చెప్పాలంటే బీజేపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న నేత, ఎమ్మెల్యేగా, ఎంపీగా మాత్రమే కాదు, ఆరేళ్ళ పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కంభంపాటి హరిబాబు విశాఖ రాజధాని విషయంలో ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. అంతెందుకు ఆయన అసలు ఏపీలో రగులుతున్న రాజధాని వివాదంపైన కూడా ఒక్క కామెంట్ కూడా ఇప్పటిదాకా చేయలేదు. విభజన ఏపీ తొలి అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు సీనియర్ నేతగా తన అభిప్రాయాన్ని చెప్పకపోవడం విచిత్రమేనని అంటున్నారు.నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారు ఏపీలో రాజధానుల విషయంలో రచ్చ చేస్తున్నారు. లేస్తే మనుషులం కామన్నట్లుగా బిల్డప్పులు ఇస్తున్నారు. 
మౌన ముద్రలోకి హరిబాబు

కేంద్రం తమ జేబుల్లో ఉందన్నట్లుగా సినిమాలు చూపిస్తున్నారు. అలాంటిది హరిబాబుకు కేంద్ర నాయకత్వంతో దశాబ్దాల పరిచయం ఉంది. ఆయన జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఉమ్మడి ఏపీ బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా కూడా వ్యవహరించిన హరిబాబుకు రాష్ట్రం గురించి, రాజకీయం గురించి పూర్తిగా తెలుసు. ఇంత అవగాహన ఉన్న హరిబాబు ఇపుడు పెదవి విప్పకపోవడం వెనక మతలబు ఏమై ఉంటుందని అంతా ఆలోచనలో పడుతున్నారు.రాజకీయాల్లో హరిబాబుకు గురువుగా భావించే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒకే చోట పాలన ఉంటే బాగుంటుదని అంటూ అమరావతికి పరోక్షంగా తన సమ్మతాన్ని చెప్పేశారని ప్రచారంలో ఉంది. మరి అదే అభిప్రాయం హరిబాబులో కూడా ఉందా అన్న చర్చ ముందుకువస్తోంది. నిజానికి హరిబాబు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడ‌లేదని గుర్తుకుతెచ్చుకుంటున్నారు. నాడు పార్టీ గట్టిగా విమర్శలు చేయమని కోరినా కూడా హరిబాబు కనీసంగా కూడా బాబుపై కామెంట్స్ చేయలేదు. దీని బట్టి విశ్లేషించుకుంటే హరిబాబు వంటి వారి ఓటు కూడా అమరావతికేనని అనిపించకమానదు.ఇవన్నీ పక్కన పెడితే తనను బీజేపీ హై కమాండ్ అసలు పట్టించుకోవడంలేదన్న ఆవేద‌న హరిబాబులో ఉందని అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు ఉండగా పార్టీకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు తెచ్చార‌ని, స్వయంగా తాను మంచి పోటీలో కూడా ఎంపీగా గెలిచానని హరిబాబు సన్నిహితులతో అంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కనీసం తాను పోటీ చేసిన చోట కూడా డిపాజిట్లు కోల్పోయినా కూడా ఆయన పెద్దన్నలా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి ఆయన అనుచరుల్లో ఉంది. పైగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ నుంచి తప్పించినా కూడా కనీసం కేంద్ర స్థాయిలోనైనా సముచిత స్థానాన్ని హరిబాబు కోరుకున్నారు. రాజ్యసభ సీటుని ఆశించారు. అయితే ఏదీ జరగదు అని తెలుసుకున్నాకే ఆయన పూర్తిగా మౌన ముద్రలోకి వెళ్ళిపోయారని అంటున్నారు. ఏపీలో చోటా మోటా బీజేపీ నేత కూడా రాజధానిపై మాట్లాడుతుంటే పెద్దాయన పలకకపోవడం వెనక ఇదే బాధ ఉందని అంటున్నారు