గాలేరు నగర రిజర్వాయర్ లో మళ్లీ కదలిక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గాలేరు నగర రిజర్వాయర్ లో మళ్లీ కదలిక

కడప, జనవరి 1, (way2newstv.com)
గండికోట రిజర్వాయర్ దిగువన 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై అధికారుల్లో కదలికమొదలైంది. కొత్తగా నిర్మించబోయే రిజర్వాయర్ ప్రాంతాన్ని నీటిపారుదలశాఖ అధికారులు  పరిశీలించారు. దీనిపై సర్వేకు సమాయత్తమవుతున్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ నుండి 5-6 కిలోమీటర్ల దూరంలో రిజర్వాయర్ నిర్మించే ప్రాంతాన్ని గుర్తించారు. గండికోట రిజర్వాయర్ తర్వాత గాలేరు-నగరి ప్రధానకాలువ తూర్పుకు ప్రవహిస్తుంది. ఇక్కడ 2వ ఫేజ్ పనులు ప్రారంభం కావాల్సివుంది. ఈ ప్రధానకాలువ కమలాపురం నియోజకవర్గంలోని సర్వారాయసాగర్ రిజర్వాయర్ వరకు మాత్రమే ఇప్పటికి పూర్తయ్యింది. 
గాలేరు నగర రిజర్వాయర్ లో మళ్లీ కదలిక

ఆ తర్వాత ఇది కడప, రాజంపేట, కోడూరు నియోజకవర్గాల మీదుగా చిత్తూరు జిల్లాలోని నగరి వరకు చేరాలి. మధ్యలో అనేక రిజర్వాయర్లు ఉంటాయి. ఈ గాలేరు-నగరి 2వ దశ పనుల ప్రస్తావన గత ప్రభుత్వం గానీ, ఈ ప్రభుత్వం గానీ చేయలేదు. ఇప్పుడు కొత్తగా గండికోట రిజర్వాయర్ నుండి దక్షిణం దిశగా 5-6 కిలోమీటర్ల దూరంలో 20 టీఎంసీల రిజర్వాయర్‌కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గండికోట రిజర్వాయర్ నుండి దక్షిణం వైపు అంతా ఎగువ ప్రాంతమే. ఇది పులివెందుల నియోజకవర్గం సరిహద్దుల్లోకి వస్తుంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు లిఫ్టు ద్వారా గండికోట నుండి నీటిని ఎత్తిపోస్తున్నారు. కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు కూడా దాదాపు 5 కిలోమీటర్లు ఎగువకు నీటిని లిఫ్టు ద్వారా పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాదాపు ఒక కిలోమీటరు దూరం మాత్రం కాలువల ద్వారా నీరు వెళ్తుందని అధికారులు అంటున్నారు. ముద్దనూరు మండలంలోని ఆరవేటిపల్లె, దీనేపల్లె గ్రామాల పరిధిలో మూడు వైపులా కొండభాగం ఉంది. ఆరవేటిపల్లె, దీనేపల్లె గ్రామాలు కొత్త రిజర్వాయర్ నిర్మాణం వల్ల ముంపుకు గురికాబోతాయి. ఈ రెండు గ్రామాలను తరలించి కట్ట నిర్మించడం ద్వారా రిజర్వాయర్ నిర్మించాలని నీటిపారుదల అధికారులు యోచిస్తున్నారు.కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి, ముంపునకు గురికాబోయే ఆరవేటిపల్లె, దీనేపల్లె గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్, పునరావాస పరిహారాలు తదితర అన్ని ఖర్చులు కలిపి రూ.400 కోట్లు కావచ్చునని అధికారుల ప్రాథమిక అంచనా. ఈ రిజర్వాయర్ నుండి ఒక కాలువ తవ్వి, గాలేరు-నగరి 2వ ఫేజ్ ప్రధానకాలువకు 14వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. మరో కాలువను తిరిగి దిగువకు గండికోట రిజర్వాయర్‌కు కలుపుతారు. అవసర సమయాల్లో ఈ నిల్వ నీటిని గాలేరు-నగరి 2వ ఫేజ్ ప్రధాన కాలువకు, గండికోట రిజర్వాయర్‌కు కూడా వాడుకుంటారు.కొత్త రిజర్వాయర్‌ను గాలేరు-నగరి 2వ ఫేజ్ ఆయకట్టు కోసం నీరు నిలువ ఉంచేందుకేనని అధికారులు చెబుతున్నారు. గాలేరు-నగరి 2వ ఫేజ్ పనులు ప్రారంభించకుండానే, ఆ ప్రాజెక్టు ఆయకట్టు కోసం నీటి నిల్వ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నాననడం నీటి పారుదల నిపుణులకు నమ్మశక్యంగా లేదు. ఇప్పటికే గండికోట రిజర్వాయర్ నుండి పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటిని లిఫ్టుల ద్వారా పంపిస్తున్నారు. ఈనెల 24వ తేదీ ముఖ్యమంత్రి జగన్ మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా గాలేరు-నగరి ప్రాజెక్టు, అనంతపురం జిల్లా సరిహద్దులోని హంద్రీ-నీవా ప్రాజెక్టుకు అనుసంధానం చేసే పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి అనుబంధంగా మరిన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుల వల్ల కడప జిల్లాలోని రాయచోటి, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. ఈ నీరంతా గండికోట రిజర్వాయర్ నుండి లిఫ్టుల ద్వారా వెళ్లాల్సిందే. 27 టీఎంసీల గండికోట నీళ్లన్నీ ఈ ప్రాంతాలకు తరలిస్తే గాలేరు-నగరి 2వ ఫేజ్‌కు నీళ్లు కరువవుతాయి. ఈ పరిణామాల్లో గాలేరు-నగరి 2వ ఫేజ్‌కు ఎసరు పెట్టినట్లేనని సాగునీటి రంగం నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాలేరు-నగరి 2వ ఫేజ్ ఆయకట్టు కిందనున్న రాజంపేట, కోడూరు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం గాలేరు-నగరి 2వ ఫేజ్ ఆయకట్టు కోసమే కొత్తగా రిజర్వాయర్ నిర్మించి నీరు నిల్వ చేయబోతున్నారని అంటున్నారు.