పారిశ్రామిక రంగానికి ప్రాణం పోసే పనిలో ఏపీ సర్కార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పారిశ్రామిక రంగానికి ప్రాణం పోసే పనిలో ఏపీ సర్కార్

విజయవాడ, జనవరి 1, (way2newstv.com)
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో విధానాల ద్వారా పరిశ్రమలకు అనుమతులు సులభతరం చేసినా పెట్టుబడులకు నోచుకోలేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. పెట్టుబడుల ఆకర్షణకు వ్యూహాత్మక అడుగులు ప్రారంభించింది. భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) యూనిట్లను ప్రోత్సహించడం, రాష్ట్రంలో సువిశాలమైన సముద్రతీర ప్రాంతంలో కొత్తగా పోర్టులను అభివృద్ధి చేయటంతో పాటు జల, వాయు, రహదారి రవాణా వ్యవస్థ అనుసంధానంతో అటు పారిశ్రామిక పురోగతి, ఇటు ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కార్యాచరణ రూపొందించింది. 
పారిశ్రామిక రంగానికి ప్రాణం పోసే పనిలో ఏపీ సర్కార్

కొద్దిరోజుల క్రితం విజయవాడలో డిప్లమోటిక్ ఔట్‌రీచ్ సదస్సు ద్వారా పారిశ్రామిక విధానంపై స్పష్టత ఇచ్చింది. పరిశ్రమలకు అన్ని అనుమతులతో పాటు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు ప్రకటించారు.అవసరమైన నైపుణ్యం, మానవ వనరులను అందుబాటులోకి తెస్తామని, అందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులకు కొన్ని దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. సుప్రసిద్ధ సంస్థలైన ఏపీహెచ్‌ఎస్‌ఎల్ స్టీల్స్ రూ. 15వేల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ఉపాధి కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పోస్కో స్టీల్ సంస్థ రూ. 35వేల కోట్లతో 6వేల మందికి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ రూ. 15వేల కోట్లు, చింగ్‌షాన్ హోల్డింగ్స్ స్టీల్స్ రూ. 14వేల కోట్ల మేర పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల 10వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్‌వేర్ సంస్థ రూ.700 కోట్లతో 10వేల మందికి, ఏటీసీ టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ 1152 కోట్లతో వెయ్యి మందికి, గ్రాసిం ఇండస్ట్రీస్ క్లోరో ఆక్లాలి రూ. 27వేల కోట్ల పెట్టుబడితో 13వందల మందికి, పీఎస్‌ఏ వాల్‌సిన్ చిప్స్ గృహోపకరణాల తయారీ సంస్థ రూ. 735 కోట్ల మేర పెట్టుబడులకు సుముఖత చూపాయి. పానాసోనిక్ ఎలక్ట్రానిక్స్ సంస్థ రూ. 1000 కోట్లతో 3వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఫిలిప్ బ్లాక్ కార్బన్ సంస్థ రూ. 600 కోట్లతో పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చింది. వీటితోపాటు మరో 19 సంస్థలు రూ. 15వేల 648 కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. వీటిద్వారా మరో 26వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే 16 యూనిట్లు రూ. 16వేల 500 కోట్లతో పనులు ప్రారంభించినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు రాష్ట్రంలో సువిశాలమైన సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రస్తుతం లావాదేవీలు జరుగుతున్నాయి. ఇవికాక కొత్తగా పోర్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రం తన వాటాను పెంచే దిశగా పరిశ్రమల స్థాపన లక్ష్యాలుగా ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం రాష్ట్రం 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరింది. ఇందులో పారిశ్రమిక రంగం వాటా కేవలం 23శాతం మాత్రమే ఉండటంతో దీన్ని పెంచే దిశగా కార్యాచరణ రూపొందించింది. పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు అవసరమైన రాజకీయ స్థిరత్వం, ఓడరేవుల ద్వారా ఆగ్నేయాసియా మార్కెట్లలో ప్రవేశం, రోడ్, రైల్ కనెక్టివిటీ, ల్యాండ్ బ్యాంక్ వంటివి ప్రధాన కారణాలుగా చూపుతోంది. ఈరకమైన వసతి విశాఖపట్నంలో ఉన్నందున పారిశ్రామిక సంస్థలు ఆ ప్రాంతం వైపే మొగ్గుచూపుతున్నాయి. వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాలను అనుసంధానిస్తూ హైవేలు, రైల్వేలతో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్‌లు, లోతట్టు జలమార్గ రవాణా కోసం బకింగ్‌హాం కాల్వ పునరుద్ధరణ, నీటి సరఫరా భరోసా కోసం డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణలో ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు, ఆదాయం పెంపుదలకు సమతుల్యత పాటించేలా ఎంఎస్‌ఎంఈల ప్రాధాన్యతను గుర్తించింది. వీటి అభివృద్ధికి ప్లగ్ అండ్ ప్లే పార్కులను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఎంఎస్‌ఎంఈ యూనిట్ల పునరుద్ధరణకు రుణాల వన్‌టైమ్ రీ స్ట్రక్చరింగ్‌కు వీలుగా ‘వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని ప్రారంభించింది. వీటితోపాటు విశాఖపట్నం - చెన్నై ఇండిస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దేశ జీడీపీలో ఉత్పాదక రంగం వాటాను పెంచడం, స్మార్ట్ సుస్థిర నగరాలను సృష్టించే ఉద్దేశంతో ఏర్పాటయ్యే వీసీఐసీతో పోర్టుల అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక అమలుచేయాలని నిర్ణయించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటం ద్వారా ఉపాధి కల్పనలో లక్ష్యాలను అధిగమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.