విజయవాడ, జనవరి 23, (way2newstv.com)
ప్రశ్నిస్తా అంటూ రాజకీయ అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ‌్ కి తన ప్రసంగాలే తనను ప్రశ్నించి నిలదీస్తాయని ఊహించివుండరు. పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికి అర్ధం కాదు. అమరావతిని రాజధానిగా నిర్ణయం చేసినప్పుడు వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఆయన క్రెడిబిలిటీ నే ప్రశ్నిస్తున్నాయి. ఈ వీడియోల్లో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ రాజధాని అంశంపై ఆయనకు ఒక క్లారిటీ లేదా లేక టిడిపి టూల్ గానే ఆయన రాజకీయాలు కొనసాగిస్తున్నారనే వైసిపి ఆరోపణలు నిజమేనా అనే తీరులో నడుస్తున్నాయి. జనసేన మీడియా గతంలో అప్ లోడ్ చేసిన విడియోలనే ఆయన ప్రత్యర్ధులు పవన్ పై అస్త్రాలుగా ప్రయోగిస్తూ గట్టి ప్రచారమే మొదలు పెట్టారు.
పవన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు
అమరావతి ని రాజధానిగా ప్రకటిస్తూ ల్యాండ్ పూలింగ్ తో వేల ఎకరాలను సేకరించడాన్ని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రం మూడు ముక్కలు కావొచ్చంటూ జోస్యం కూడా చెప్పేశారు. ఆ తరువాత మరో సందర్భంలో చంద్రబాబు చర్యలను తిట్టి పోశారు. ఎవరి లబ్ది కోసం రాజధాని అని శ్రీకాకుళం నుంచి వచ్చే ఒక సామాన్యుడు భూమి కొనాలనుకున్నా నివాసం ఉండాలన్న సాధ్యం కాదని దుమ్మెత్తిపోసేసారు.మరో సందర్భంలో కర్నూలు లో మాట్లాడుతూ రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయినా ఈ ప్రాంతం ఇలానే ఉండి పోయిందని కానీ తాను గానీ సిఎం అయితే ఈ ప్రాంతాన్ని క్యాపిటల్ కన్నా ఉన్నతంగా చేస్తా అని హామీ ఇచ్చేశారు. తాను కర్నూలు రాజధాని అని గుర్తిస్తున్నా అంటూ అక్కడివారి మనసులు దోచేశారు. తాజాగా అమరావతి ఉద్యమంలో పవన్ చేస్తున్న కామెంట్స్ వీటన్నిటికీ భిన్నంగా ఉండటాన్ని ఇప్పుడు అంతా ప్రశ్నిస్తూ నిలదీస్తున్నారు. ఇలా రోజుకో మాట చెప్పి చివరికి ఆయన మరొకరకంగా చేయడం జనసేనానికే చెల్లిందని సోషల్ మీడియా లో చర్చ జోరుగా సాగుతుంది.