ఉత్పత్తికి ఏదీ..? (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉత్పత్తికి ఏదీ..? (ఖమ్మం)

ఖమ్మం, జనవరి 07 (way2newstv.com):
రాష్ట్ర అవసరాల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం మొదటి యూనిట్‌ నుంచి గతేడాదిలో ఉత్పత్తి దాదాపు లేనట్టే. 2019 డిసెంబరులోగా విద్యుత్తు కేంద్రం మూడు యూనిట్లు సింక్రనైజేషన్‌ పూర్తి చేస్తామని జెన్కో సీఎండీ, డైరెక్టర్లు పలుమార్లు స్పష్టం చేసినా.... క్షేత్రస్థాయిలో పనులు చూస్తే ఆ పరిస్థితి కనిపించలేదు. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్‌ సింక్రనైజేషన్‌ పూర్తి చేసి మూడు నెలలు గడిచింది. పనుల్లో వేగం మందగించడంతో మొదటి యూనిట్‌ సీవోడీ(కమర్షియల్‌ ఆపరేషన్‌ డే) నేటి వరకు జరగలేదు. దీంతో 2020 జనవరిలోనైనా మొదటి యూనిట్‌ సీఓడీ, విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 
ఉత్పత్తికి ఏదీ..? (ఖమ్మం)

బీటీపీఎస్‌లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం కాకపోవటానికి నిర్మాణ కంపెనీలు పనులు నెమ్మదిగా చేయడమే కారణంగా తెలుస్తోంది. మొదటి, రెండో యూనిట్లకు చెందిన ఈఎస్పీ(ఎలక్ట్రో స్టాటిక్‌ ప్రెసిపిటేటర్‌)ల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయి. మొదటి యూనిట్‌ సీఓడీ, రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఈఎస్పీల నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. విద్యుత్తు ఉత్పత్తి సమయంలో వెలువడే బూడిద ఈఎస్పీల నుంచి, పైపుల ద్వారా యాష్‌పాండ్‌కు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈఎస్పీల నిర్మాణ పనులు పూర్తి చేయటం ఎంతో అనివార్యం. కొద్ది నెలల క్రితం మొదటి, రెండో యూనిట్‌ ఈఎస్పీలో జరిగిన ప్రయోగాత్మక పరీక్షలు విఫలమయ్యాయి. దీనిపై జెన్కో ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇటీవల బీటీపీఎస్‌ను సందర్శించిన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు నిర్మాణ పనులు ఆలస్యంపై భెల్‌ అధికారులను గట్టిగా మందలించారు. ఈఎస్పీ నిర్మాణ పనులు ఆలస్యంతోనే విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. బీటీపీఎస్‌లో బాయిలర్లు, టర్బయిన్లు, యాష్‌పాండ్‌, చిమ్నీలు, కూలింగ్‌ టవర్లు, కోల్‌బెల్టు, ట్రాక్‌ హార్పర్‌ తదితర నిర్మాణ పనులను 20 కంపెనీలు చేపడుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో తగినంతమంది కార్మికులు లేరు. ప్రస్తుతం 3,000-3,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి కార్మికులు పనులు చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం అనుకూలించక ఎక్కువ మంది ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త కార్మికులు రాలేదు. దీంతో ఏడాదిగా పనుల్లో కార్మికుల సంఖ్య పెరగడం లేదు. కార్మికులకు వేతనాలు కూడా సకాలంలో అందడంలేదు. పనుల ఆలస్యానికి, కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఇదీ ఓ కారణమే. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ కంపెనీలు కార్మికుల సంఖ్యను పెంచితేనే జెన్కో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. లేకుంటే బీటీపీఎస్‌లో విద్యుత్తు ఉత్పత్తి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. బీటీపీఎస్‌లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైతే వచ్చే  ఈ ఏడాది మార్చి నాటికి 10 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఉంటుందని జెన్కో భావించింది. ఇప్పటి వరకు విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం కాకపోవటంతో బొగ్గు రవాణాను 10 లక్షలు నుంచి 5 లక్షల టన్నుల వరకు తగ్గించాల్సి వచ్చింది. కానీ నేటి వరకు కూడా అయోదు లక్షల టన్నుల బొగ్గు రవాణా ప్రారంభం కాలేదు. విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించే బొగ్గును క్రష్‌ చేసేందుకు జరుగుతున్న మొబైల్‌ క్రషర్‌ పనులు పూర్తి కావొచ్చాయి. మొదటి యూనిట్‌ మొబైల్‌ క్రషర్‌ పనులు దాదాపుగా తుదిదశకు చేరాయి. రెండో యూనిట్‌ క్రషర్‌ పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా జరిగేందుకు మూడేళ్ల గడువు ఉండటంతో తాత్కాలికంగా జెన్కో సంస్థ మొబైల్‌ క్రషర్‌ పనులు చేపట్టింది. బీటీపీఎస్‌కు కావాల్సిన బొగ్గును రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసేందుకు రెండు ఏజెన్సీలతో ఒప్పందం కుదరింది. ఒప్పందం జరిగి నెలలు గడిచినా విద్యుత్తు ఉత్పత్తికి పనులు ముందుకు సాగకపోవటంతో బొగ్గు రవాణా ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది.