ఆకట్టుకుంటున్న అక్వేరియం.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆకట్టుకుంటున్న అక్వేరియం....

తిరుపతి, జనవరి 23,(way2newstv.com)
తిరుపతి నగరంలోని ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవలకాలంలో పెద్దఎత్తున రంగుచేపలను పెంచుతున్నారు. రంగుచేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే సాగరంలో కనిపించే దశ్యాలన్నీ కనులముందే కదలాడుతున్నట్లు ఉంటోందంటూ సంబరపడుతున్నారు. అందుకే ప్రజలు రంగుచేపల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటున్నాయి. పాఠశాలల్లో, ఇళ్లల్లో, కార్యాలయాల్లో రంగుచేపలను ఎక్కువగా పెంచుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వీటిని ఎంతో ఇష్టంగా పెంచుతున్నారు. ఆరెంజ్‌ గోల్డ్‌ఫిష్‌, బ్లాక్‌గోల్డ్‌, వ్కెట్ష్‌గోల్డ్‌, బ్లాక్‌ మాలీస్‌, ఆరెంజ్‌ మాలీస్‌, గప్పీలు, సింగపూర్‌ గప్పీలు, టైగర్‌లు, లక్కీఫిష్‌లు, స్మైల్‌ఫిష్‌లు, సీల్‌ఫిష్‌, ఫైటర్స్‌, డస్ట్‌ఫిష్‌ వంటి ఎన్నో రకాలైన రంగుచేపలు అందుబాటులో ఉన్నాయి. 
ఆకట్టుకుంటున్న అక్వేరియం....

బౌల్‌(కుండ) అక్వేరియం రూ.150కి విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి తమ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్ని అడుగుల అక్వేరియంలు కావాలన్నా వ్యాపారులు వాటిని తయారుచేసి విక్రయిస్తున్నారు. అలంకరణకు రంగురాళ్లు, వివిధ రకాలైన బొమ్మలు, దాని లోపల చిన్నపాటి ట్యూబ్‌లైట్‌ను కూడా అమరుస్తుండటంతో లైటువెలుగులో మీనాలు మరింత ఉత్సాహంగా కదలాడుతున్నాయి. తాబేళ్లను కూడా ఉత్సాహంగా కొనుగోలు చేస్తుండటంతో గార్డెన్స్‌లో వీటి విక్రయం కూడా పెరుగుతోంది. నీటిలో బ్యాక్టీరియాను నిరోధించేందుకు పచ్చ, నీలి రంగులతో కూడిన లిక్విడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో కాసేపు రంగుచేపలను తదేకంగా చూడడం వల్ల ఉపశమనం కలుగుతుందనేది శాస్త్రీయంగా కూడా రుజువు కావడంతో ఆసుపత్రులు, కార్యాలయాల్లో రంగుచేపల తొట్టెలు ఉంచుతున్నారు. జత చేపలు రూ.30 నుంచి ప్రారంభమవుతున్నాయి. రూ.3 వేల ఖరీదు చేసే చేపలను కూడా విక్రయిస్తున్నారు. ఇటీవల తిరుపతి నగరంలో లవ్‌బర్డ్స్‌కూ విశేష ఆదరణ పెరిగింది. పావురాలు, రంగురంగుల పక్షులు, వాటి గూళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పావురాల జంట రూ. 400 నుంచి 2 వేల వరకు అమ్ముడవుతోంది. అలాగే కుందేళ్లు, ఇతర పక్షుల వెల రూ 300 నుంచి 3 వేల వరకు ఉంటోంది. తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీ సర్కిల్‌, మహతి ఆడిటోరియం ఎదురుగా అక్వేరియంలు, లవ్స్‌బర్డ్స్‌, కుందేలు విక్రయ కేంద్రాలు ఉన్నాయి. లవ్‌బర్డ్స్‌, పావురాల వినియోగం కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగింది.అక్వేరియం ముందు కూర్చుని రంగురంగుల చేపల కదలికలను చూస్తుంటే రంగుల ప్రపంచంలో ఉన్నట్లు భావన కలుగుతోంది. ఎంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చిన్నపిల్లల నుంచి నేటి యువత వరకు చాలా మంది ఇళ్లలో చిన్నపాటి అక్వేరియాలను కొనుగోలు చేస్తున్నారు. చిన్న చేప పిల్లల నుంచి పెద్ద చేపల వరకు అన్నీ తిరుపతిలోనే దొరుకుతున్నాయి. ఒకప్పుడు చెన్నై, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో దొరికేవి. ఇప్పుడు తిరుపతిలోనే చేపపిల్లలకు కావాల్సిన మేత, ఇతరత్రా లిక్విడ్స్‌ అన్నీ లభ్యమవుతున్నాయి.