విన్నపాలు వినవలె...

బెంగళూర్, జనవరి 25 (way2newstv.com)
దావోస్ పర్యటనను ముగించుకుని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వచ్చేయడంతో మరోసారి మంత్రి వర్గ విస్తరణ పై చర్చ మొదలయింది. ఇటీవలే అమిత్ షాతో మంత్రి వర్గ కూర్పు పై చర్చించిన యడ్యూరప్ప మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకత్వాన్ని కలవనున్నారు. నూతన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా యడ్యూరప్ప కలవనున్నారు. ఇప్పటికే నడ్డాతో మాట్లాడుకుని మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మంత్రి వర్గ విస్తరణ కోసం అనేక మంది ఎదురు చూపులు చూస్తున్నారు. ఉప ఎన్నికలు జరిగి నెలన్నరకు పైగానే అయినా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో అసహనం పెరిగింది. వారు తమ అసంతృప్తిిని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. 
విన్నపాలు వినవలె...

అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయనని యడ్యూరప్ప భరోసా ఇవ్వడంతో అనర్హత వేటు పడి తిరిగి గెలిచిన ఎమ్మెల్యేలు విస్తరణలో తమకు అవకాశం ఉంటుందన్న ఆశతో ఉన్నారు.ఈసారి మంత్రి వర్గ విస్తరణలో మొత్తం 16 మంత్రి పదవులను భర్తీ చేయాలని యడ్యూరప్ప పట్టుదలతో ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం 11 మందికే పరిమితం చేయాలని ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. మరో ఐదు పదవులు ఖాళీగా ఉంచాలని, భవిష్యత్తులో భర్తీ చేయాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవుల కోసం అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ సీనియర్లు దాదాపు ఇరవై మందికి పైగానే పోటీ పడుతున్నారు.అసంతృప్తులు తలెత్తకుండా చేయాలంటే మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేయాలి. కొందరిని తొలగించాలి. అయితే మంత్రివర్గంలో చేరి నెలలు కూడా గడవకముందే తొలగిస్తే మళ్లీ అసంతృప్తి తలెత్తే అవకాశముంది. యడ్యూరప్ప మాత్రం బీజేపీ నుంచి మంత్రి పదవులు ఆశించే వారికి అధిష్టానాన్ని కలవాలని చెబుతుండటం విశేషం. బీజేపీ నుంచి మంత్రులు ఎవరో తేల్చేది అధిష్టానమేనని, తాను అనర్హత వేటు పడి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడమే తన ప్రయత్నమని యడ్యూరప్ప చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు, మూడు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు
Previous Post Next Post