రాజధానిలో వైసీపీ నేతలు తలో దారి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధానిలో వైసీపీ నేతలు తలో దారి

గుంటూరు, జనవరి 4, (way2newstv.com)
ప్రస్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ప్రజ‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. గ‌డిచిన రెండు వారాలుగా కూడా ప్రజలు రోడ్ల మీద‌కు వ‌చ్చి మూడు రాజ‌ధానుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక‌, విప‌క్షాలు ప్రజల‌కు తోడై.. వారిని మ‌రింత‌గా రెచ్చగొడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రోజుకో విధంగా టీడీపీ, జ‌న‌సేన‌, వామ ప‌క్షాలు, బీజేపీలు ఇక్కడ ప్రజ‌ల‌ ఆందోళనల్లో పాలు పంచుకుంటున్నాయి. వారి ప‌నులు కూడా మాన్పించి మ‌రీ ఉద్యమంలో పాల్గొనేలా చేస్తున్నాయి. వాస్తవం ఎలా ఉన్నా.. ఇక్కడి ప్రజ‌లు మాత్రం రోడ్ల మీద‌కు చేరుతున్నారు. నినాదాలు చేస్తున్నారు. నిర‌స‌న‌లు వ్యక్తం చేస్తున్నారు. వారి వారి పంథాల్లో విమ‌ర్శలు చేస్తున్నారు.
రాజధానిలో వైసీపీ నేతలు తలో దారి

అదే స‌మ‌యంలో ఈ రాజ‌ధాని గ్రామాల ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేల‌కు కూడా నిర‌స‌న సెగ‌లు బాగానే త‌గులుతున్నాయి. ఇక్కడి ప్రజ‌లు త‌మ ఎమ్మెల్యేలు క‌నిపించడం లేద‌ని ఆరోపిస్తూ.. పోలీసుల‌కు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో ఒకింత స్పందించిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి రాజ‌ధాని రైతుల‌కు భ‌రోసా ఇచ్చే ప్రయ‌త్నం చేశారు. రైతుల‌కు త‌మ ప్రభుత్వం అన్యాయం చేయ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్దని, అవ‌స‌ర‌మైతే.. తానే రైతుల ప‌క్షాన నిల‌బ‌డ‌తాన‌ని కూడా చెప్పారు. మ‌రి అదే స‌మ‌యంలో తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి మాత్రం మౌనం పాటిస్తున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు అసలు నియోజక‌వ‌ర్గం మొహం కూడా చూడ‌ని ఆమె ఎట్టకేల‌కు ఫ్లారెన్స్ నైటింగేల్ జ‌యంతి కార్యక్రమాన్ని పుర‌స్కరించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే, మీడియా ముందు మాత్రం రాజ‌ధాని విష‌యంపై మాట్లాడేందుకు ఇష్టప‌డ‌లేదు. తాను మాట్లాడ‌బోన‌ని చెప్పారు. ఇదే ఇప్పుడు ఆమెకు మైన‌స్‌గా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీలో భారీ ఎత్తున ప్రభుత్వం త‌ర‌ఫున మాట్లాడి.. ప్రతిప‌క్షాల‌పై విమ‌ర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించే శ్రీదేవి.. ఇప్పుడు రాజ‌ధాని విష‌యంపై త‌న‌దైన శైలిలో స్పందించి రైతుల‌కు కాస్త భ‌రోసా ఇచ్చే వ్యాఖ్యలు చేస్తే.. పార్టీ త‌ర‌ఫున‌, త‌న త‌ర‌పున కూడా ప్రజ‌ల్లో ఒకింత చ‌ర్చ జ‌రిగి ఉండేద‌ని అంటున్నారు. అంతేత‌ప్ప..త‌ప్పించుకుని తిరిగితే ప్రయోజ‌నం ఏంట‌నే ప్రతి విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అస‌లు త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే రాజ‌ధాని ప్రాంతం ఎక్కువుగా విస్తరించి ఉంది. రైతుల్లో శ్రీదేవి పేరు చెపితే తీవ్ర వ్యతిరేక‌త క‌నిపిస్తోంది. సామ‌న్య ప్రజ‌ల్లోనూ ఆమె తీరుపై విసుగు వ‌చ్చేసింది. మ‌రి డాక్టర్ శ్రీదేవి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో ? చూడాలి.