భగ్గుమంటున్న ఆయిల్ ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భగ్గుమంటున్న ఆయిల్ ధరలు

ముంబై, జనవరి 10 (way2newstv.com)
చమురు ధరలు సలసల కాగుతున్నాయి. ఇరాక్‌లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణిలతో దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర శుక్రవారం ఒకేరోజు 4.5 శాతం ఎగబాకింది. ఇరాన్‌ కమాండర్‌ను హతమర్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత శుక్రవారం ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీంతో న్యూయార్క్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 72 డాలర్లు పలికింది. ఈ విషయాన్ని ఎస్‌ఈబీ అనలిస్ట్‌ బజార్నే స్కెయిల్‌డ్రాప్‌ తెలిపారు. ఆ తర్వాత మళ్లీ పరిస్థితులు శాంతించినట్లు వచ్చిన సంకేతాలతో స్వల్పంగా తగ్గినప్పటికీ, బుధవారం ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగడంతో మళ్లీ ధరలు మండుతున్నాయి. 
భగ్గుమంటున్న ఆయిల్ ధరలు

ఒకవైపు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నప్పటికీ..మరోవైపు ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం పడలేదని విశ్లేషకులు వెల్లడించారు. అమెరికాపై జరిగిన ప్రతీకార దాడులు ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని ఇరాన్‌ వర్గాలు హెచ్చరికలు ఇంధన ధరలు భగ్గుమనడానికి పరోక్షంగా కారణమయ్యాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇంధన ధరలతోపాటు స్టాక్‌ మార్కెట్లను చుట్టుముట్టాయి. లండన్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌, ప్యారిస్‌ షేర్లు ఒక్కశాతం వరకు నష్టపోయాయి.దేశీయంగా వినియోగిస్తున్న ఇంధనంలో 80 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు చమురు సెగ గట్టిగానే తాకనున్నది. బ్యారెల్‌ క్రూడాయిల్‌ 70 డాలర్లు దాటడంతో దిగుమతి బిల్లు మరింత పెరిగి ద్రవ్యలోటు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75.74 వద్దకు చేరుకోగా, అలాగే డీజిల్‌ రూ.68.79 పలికింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.80.54కి చేరుకోగా, డీజిల్‌ రూ.75 వద్ద నిలిచింది.