చెన్నై, జనవరి 13 (way2newstv.com)
తమిళనాడులో రజనీకాంత్ పార్టీ వచ్చేది ఖాయమని తేలిపోయింది. రజనీకాంత్ రాకకోసం ఎంతో మంది నేతలు ఎదురు చూస్తున్నారు. ఆయన అంగీకరిస్తే అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే రజనీకాంత్ ఇప్పటి వరకూ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. రజనీకాంత్ పార్టీ ప్రకటించిన తర్వాత ఆయన నుంచి అలాంటి సిగ్నల్స్ వస్తాయని అన్ని పార్టీల రాజకీయ నేతలు వేచి చూస్తున్నారు. కొత్త పార్టీ, అదీ రాష్ట్రం జయలలిత అంతటి చరిష్మా ఉన్న రజనీకాంత్ పార్టీ పెడితే ఏ రాజకీయ నేత రాకుండా ఉండరనేది వాస్తవం.అయితే రాజకీయ నేతలే కాదు ఇప్పుడు పార్టీలు కూడా రజనీకాంత్ కోసం వేచి చూస్తున్నాయి. రజనీకాంత్ ను మంచి చేసుకునేందుకు ప్రధానంగా జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రజనీకాంత్ తొలి నుంచి బీజేపీ అనుకూలురన్న ప్రచారం జరిగింది. ఆ ముద్ర కూడా పడింది.
అందరి చూపు..రజనీ వైపు
ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా ఒకానొక దశలో జరిగింది. బీజేపీ నేతలు తరచూ రజనీకాంత్ తో సమావేశం కావడం వంటివి కూడా ఇందుకు మరింత బలపర్చాయి.కానీ కమల్ హాసన్ తో కలసి నడిచేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రజనీకాంత్ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు ఒకింత సందిగ్దంలో పడ్డారు. కమల్ హాసన్ బీజేపీకి బద్ధ విరోధి. బీజేపీ ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే కమల్ హాసన్ బీజేపీతో రజనీకాంత్ కలిసేందుకు ఇష్టపడరు. అందుకే బీజేపీ నేతలు కూడా రజనీకాంత్ పై ఇక ఆశలు వదులుకున్నారు. తాము ప్రస్తుత అధికార అన్నాడీఎంకేతో కలసి వెళ్లాల్సిందేనని మెంటల్ గా ఫిక్స్ అయినట్లే కన్పిస్తున్నారు.మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ రజనీకాంత్ పై ఆశలు పెంచుకుందట. కాంగ్రెస్ కొన్ని దశాబ్దాలుగా డీఎంకే వెంట నడుస్తుంది. డీఎంకే విదిల్చిన సీట్లను మాత్రమే తాను తీసుకుంటుంది. అయితే కరుణానిధి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలకు డీఎంకే పై నమ్మకం సన్నగిల్లినట్లుంది. అందుకే రజనీకాంత్ వెంట పడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ కొత్తగా పెట్టబోయే పార్టీతో కలసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జాతీయ స్థాయి నేతలను చెన్నైకి రప్పించాలని, రజనీతో చర్చలు జరపాలని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద జాతీయ పార్టీలు రజనీకాంత్ ప్రాపకం కోసం నిరంతరం ప్రయత్నిస్తుండటం విశేషం