విజయవాడ, జనవరి 7, (way2newstv.com)
మాజీ మంత్రి నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆయన్ను యనమలకుదురు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లోకేష్‌తో పాటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటూ మరికొందరు నేతల్ని అరెస్ట్ చేశారు. లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తనను అరెస్ట్ చేయడంపై లోకేష్ మండిపడ్డారు.
నారా లోకేష్ అరెస్ట్
ఏ కారణంతో తనను అరెస్ట్ చేస్తారని లోకేష్ పోలీసుల్ని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్బంధనకు అమరావతి జేఏసీ, రైతులు పిలుపునిచ్చారు. నారా లోకేష్ కూడా విజయవాడలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ దీక్షను విరమింపజేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి చినకాకాని బయల్దేరగా వారధి దగ్గరే అరెస్ట్ చేశారు.మరోవైపు చినకాకాని దగ్గర రైతుల హైవే దిగ్బంధం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోనళ నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును రైతులు, ఆందోళనకారులు అడ్డుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు ధ్వంసంకాగా.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.