ఆక్వా రంగానికి మంచి రోజులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆక్వా రంగానికి మంచి రోజులు

ఏలూరు, జనవరి 30, (way2newstv.com)
ఆర్థిక సమస్యలతో నడుస్తున్న ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీల చెల్లింపులో కాస్తంత వెసులుబాటు లభించనుంది. ఆక్వా రైతులను ఆదుకునేందుకు వీలుగా వీరి నుంచి వసూలు చేసే యూనిట్ విద్యుత్ చార్జీలు రెండు రూపాయల నుంచి ఒక రూపాయి 50 పైసలకు తగ్గించింది. దీంతో ప్రతి యూనిట్‌కు 50 పైసలు వంతున తగ్గించినట్టు అయ్యింది. దీంతో ఇకపై ఆక్వా రైతు నెలవారీ చార్జీల మొత్తం మీద లబ్ధి పొందే అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ కేంద్రంగా ఏపీఈపీడీసీఎల్ వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ టారిఫ్‌పై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన రైతులు తమతమ విద్యుత్ సమస్యల గురించి ఫిర్యాదులు చేశారు. 
ఆక్వా రంగానికి మంచి రోజులు

సాంకేతిక పరమైన సమస్యలతో తరచూ నష్టాలను ఎదుర్కొనే ఆక్వా కల్చర్ ద్వారా లాభాలు లేకపోయినా కనీసం నష్టాల నుంచి బయటపడేందుకు వీలుగా విద్యుత్ చార్జీల చెల్లింపులో కాస్తంత వెసలుబాటు కల్పించాల్సిందిగా పలువురు రైతులు కోరారు. ప్రభుత్వ హయాంలో ఇటీవల ఏపీఈపీడీసీఎల్ వేదికగా ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఆక్వా రైతులు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటినీ పరిశీలించి ఆక్వారైతులను ఆదుకునేందుకు వీలుగా విద్యుత్ చార్జీల చెల్లింపులో స్వల్ప తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీడీసీఎల్ యాజమాన్యం ఆక్వా రైతులు చెల్లించే రెండు రూపాయలను కేవలం ఒక రూపాయి 50 పైసలకు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. దీనివల్ల అయిదు జిల్లాలకు చెందిన 24 వేల 22 మంది ఆక్వా రైతులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వంపై రూ.340 కోట్ల మేర భారం పడుతుంది. ప్రభుత్వం కల్పించిన వెసలుబాటుతో ఆక్వా రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయినా స్వల్పంగా తగ్గించిన విద్యుత్ చార్జీలనే ఆక్వా రైతులకు అమలు చేయాలని ఈపీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయించింది. ఆక్వా వ్యవసాయం మీదే ఆధారపడే రైతులు ఎక్కువుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండగా, తూర్పు గోదావరి, విశాఖ జిల్లా సముద్రతీర ప్రాంతాల్లో అక్కడకక్కడ మాత్రమే వీటిని నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించి, అంతర్గత సామర్థ్యాన్ని పెంచడం కోసం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు వీలుగా ‘పవర్ ఫర్ ఆల్ ’ పథకంలో భాగంగా రూ.136.5 కోట్లతో (హైవోల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) హెచ్‌వీడీఎస్ పనులు నిర్వహిస్తుంది. తద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతోపాటు మరోవైపు విద్యుత్ పంపిణీలో జరిగే నష్టాలను తగ్గించినట్టు అవుతుందని సంస్థ అధికార వర్గాలు చెబుతున్నాయి.